The Desk…Eluru : ఏలూరును అతిపెద్ద పారిశ్రామికవాడగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

The Desk…Eluru : ఏలూరును అతిపెద్ద పారిశ్రామికవాడగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అతిపెద్ద పారిశ్రామికవాడగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. బెంగళూరుకు చెందిన హార్టి గ్రీన్ ఫుడ్స్ థాయిలాండ్ లిమిటెడ్ ప్రతినిధులు సుగుణప్రియ వెల్లంకి, బాబీ పటేల్ ఏలూరులోని కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను బుధవారం కలిశారు. ఏలూరు ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు తాము సుముఖంగా ఉన్నందున తమకు సహకరించాలని ఎంపీ మహేష్ కుమార్ ను కోరారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు తన పూర్తి సహకారం ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం నిర్వాహకం వలన మెగా ఇండస్ట్రియల్ హబ్ కలగానే మిగిలిపోయిందని ఆరోపించారు. గత టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులను వైస్సార్సీపీ ప్రభుత్వం పక్కన పడేసిందని ఎంపీ మండిపడ్డారు.

దక్షిణాదిలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని గొప్పలుపోయిన జగన్ ప్రభుత్వం కనీస మౌలిక వసతుల కల్పనకూ చొరవ చూపలేదని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకపోగా వారి బెదిరింపుల కారణంగా గతంలో ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు సైతం పరిశ్రమల స్థాపనకు వెనకాడుతున్నారని ఎంపీ తెలిపారు. ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని ఎంపీ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని ఐటి హబ్ గా తయారు చేయడానికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎంపీ స్పష్టం చేశారు. యువనేత నారా లోకేష్ స్ఫూర్తితో ఏలూరు పార్లమెంట్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటు సంబంధించి ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ఎంపీ తెలిపారు.

ముఖ్యంగా ఏలూరు ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సాధ్యమైనంత ఎక్కువగా ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని , రానున్న రోజుల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలో పరిశ్రమల స్థాపన జరుగుతుందని ఎంపీ తెలిపారు.