- ఇంతవరకు అక్కడికక్కడే 96 అర్జీల పరిష్కారం…
— జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లాలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘మీ భూమి… మీ హక్కు’ పేరుతో గురువారం ఏర్పాటుచేసిన రెవిన్యూ సదస్సుల నిర్వహణపై జేసీ వివరాలు తెలియజేసారు.
జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా గత రెండు రోజుల్లో 64 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. గురువారం నిర్వహించిన 30 రెవిన్యూ సదస్సుల్లో 1212 మంది పాల్గొని ఆయా సమస్యలపై 487 అర్జీలను అందజేశారని, వాటిలో 71 దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు.
రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గత రెండురోజుల్లో నిర్వహించిన 64 గ్రామ రెవిన్యూ సదస్సుల్లో 854 అర్జీలు రాగా వాటిలో అక్కడికక్కడే 96 అర్జీలు పరిష్కరించబడ్డాయన్నారు.
రెవిన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జనవరి 8వ తేదీ వరకు ఆయా గ్రామల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని తమ భూములకు సంబందించిన సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు.