The Desk… Eluru : ముడుపులిచ్చుకో… మేడకట్టుకో…‼️

The Desk… Eluru : ముడుపులిచ్చుకో… మేడకట్టుకో…‼️

  • NR పేట లో నామ మాత్రపు నోటీసులు‼️
  • సైలెంట్ మోడ్ లో సంబంధిత అధికారులు
  • ముడుపులు – మామూలే..‼️
  • నిబంధనలకు తిలోదకాలు..‼️
  • నగరం నడిబొడ్డున – నవయుగ ప్రక్కన

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తే.. నోటీసులు ఇచ్చి నేలమట్టం చేస్తాం..ఇది ఏలూరు కార్పొరేషన్ యంత్రాంగం చెప్పే మాట. కానీ ఆ మాటలు చేతల వరకు రావడం లేదు. ‘మూటలు’ అందితే చాలు అక్రమమైనా.. సక్రమమైపోతున్నాయి. నగరపాలక సంస్థలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

ఎవరైనా ఫిర్యాదు చేస్తే..నోటీసులు ఇవ్వడం.. సీజ్‌ చేయడం చేస్తున్నా.. చర్యల విషయానికి వచ్చే సరికి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే.. సదరు నోటీసులు అందుకున్న భవన యజమాని మిగిలిన పనులన్నీ చకచకా కానిచ్చేస్తున్నాడు.

అందుకు నిదర్సనం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నందు ట్రాఫిక్ సిగ్నల్ అతిసమీపంలో నిర్మిస్తున్న భవనం చాలు… ఈ వ్యవహారంలో ‘చేతివాటం’ గట్టిగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా సెల్లార్లు, అదనపు అంతస్తులు నిర్మిస్తున్నా.. అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

ఫిర్యాదు చేసినా..ఒత్తిడి తెచ్చినా.. కేవలం నోటీసులతో సరిపెడుతున్నారు. నోటీసు అందుకునే నిర్మాణదారుడు డబ్బులిస్తే చాలు ..ఆ నిర్మాణం జోలికి వెళ్లడం లేదు.. అధికారులు. ఒక నిర్మాణం రాత్రికి రాత్రే జరగదు. రోజుల తరబడి ఉంటుంది. ముడుపుల మత్తులో పడి నిబంధనలకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పాతర వేస్తున్నారు.

ఇదిలా ఉంటే నోటీసులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లకపోవడం మరింత విమర్శలకు తావిస్తోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ఇప్పటికే టౌన్‌ప్లానింగ్‌ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని, అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

స్థానిక జీ+4 అంతస్తుల నిర్మాణాలు జరిగే చోట అడ్డగోలుగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నారు. సెట్‌ బ్యాక్‌ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. సామాన్యుడు చిన్నగా సెట్‌ బ్యాక్‌ ఉల్లంఘన చేస్తే.. చర్యలు తీసుకునే అధికారులు.. బడా బాబుల నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు.

నోటీసులతో సరి…

నగరపాలక సంస్థ అధికారులకు అందిన ఫిర్యాదులపై నోటీసులను జ్వరి చేసిన భవనాల్లో యథేచ్ఛగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఫిర్యాదు వస్తే అధికారులు రంగంలోకి దిగి.. అలా నోటీసులు ఇచ్చినట్టే ఇచ్చి.. దొడ్డిదారిలో పనులకు అనుమతులు ఇచ్చేస్తుండటం గమనార్హం.

స్వయంగా అధికారులు వచ్చినా.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నివాసయోగ్య పత్రాల మంజూరు, నిర్మాణ అనుమతుల జారీ, అక్రమ నిర్మాణాలు లంచావతారులకు ప్రధాన ఆర్థిక వనరుగా మారుతున్నాయి.

అనుమతి కోసం వచ్చే దరఖాస్తులను వేర్వేరు కారణాలతో తొక్కి పెట్టడం, భయాందోళనకు గురయ్యే యజమానుల నుంచి ముడుపులు తీసుకోవడం అధికార యంత్రాంగానికి అలవాటుగా మారింది. వీటిపై ఉన్నత స్థాయి అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి..!!