- ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి..
ఏలూరు జిల్లా : దిల్లీ/ ఏలూరు : THE DESK :
కూటమి ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.94 లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం ద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పునరుజ్జీవం పోయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల స్వర్ణాంధ్ర కల సాకారం చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
వైఎస్సార్సీపీ సర్కార్ అరాచకాల వల్లే రాష్ట్ర ఆర్థిక రథం అగాథంలో కూరుకుపోయిందని, మళ్లీ గాడిన పెట్టే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
ఉన్నత విద్య, ఆరోగ్య రంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించడం అభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయ వ్యక్తం చేశారు.
బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యం కల్పించడాన్ని స్వాగతించారు.
కీలకమైన నైపుణ్యాభివృద్ధి శాఖకు నిధులు కేటాయించడం వల్ల ఉద్యోగ ఉపాధి కల్పన మెరుగుపడుతుందని తెలిపారు.
వ్యవసాయ రంగం, జలవనరుల శాఖ, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇంధనరంగం , పర్యావరణ అటవీశాఖ, యువజన, పర్యాటక, సాంస్కృతిక, పోలీసు శాఖకు నిధుల నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజల రుణం తమ ప్రభుత్వం తీర్చుకుంటుందని ఎంపీ స్పష్టం చేశారు.