ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధ, భూసేకరణ అంశాలకు అత్యధిక ప్రాధాన్యత…
రెవిన్యూ అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి…
అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలి…
అవినీతి ఆరోపణలపై తక్షణ చర్యలు ఉంటాయి…
విధి నిర్వహణలో సమర్ధతచూపే తహశీల్దార్లకు ర్యాంకింగ్...
రెవిన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి…
ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించి రెవిన్యూ శాఖ ప్రతిష్టతను మరింత పెంచేందుకు ప్రతి అధికారి, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి రెవిన్యూ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధ, భూసేకరణ, ధాన్యం కొనుగోలు, రీసర్వే, ఓటర్లజాబితా సరవరణ, గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, నీటి సంఘాల ఎన్నికలు, కోర్టుకేసులు తదితర అంశాలపై రెవిన్యూ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్బంగా ఇటీవల వరదలు, భారీ వర్షాల సమయంలో సమష్టి సమన్వయంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతు… రెవిన్యూ అధికారులు తమ పనితీరు మెరుగుపర్చుకొని శాఖ ప్రతిష్టను పెంచేందుకు బాధ్యతాయుతంగా కృషిచేయాలన్నారు. పనితీరు కనపరిచే తహశీల్దార్లకు ర్యాంకింగ్ ఇస్తామని, ఉత్తమ తహశీల్దార్లను సత్కరిస్తామని తెలిపారు.
ఎలాంటి సమస్య అయినా కాలాతీతం చేయకుండా వేగంగా స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. రెవిన్యూ సేవల్లో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు.
ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధ, భూసేకరణ అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్ధలో అందే ధరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ లో అందిన పిర్యాదులును ఎటువంటి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏ ఉండేందుకు ఎంతమాత్రం వీలులేదని స్పష్టం చేశారు.
మండల, డివిజన్ స్ధాయిలో పిర్యాదులు సంతృప్తి స్ధాయిలో పరిష్కరించే దిశగా జాగ్రత్తగా పనిచేయాలన్నారు. పిర్యాదు అందగానే అది మన పరిధిలో ఉందా లేదా పై స్ధాయిలో ఉందా అని అవగాహన చేసుకొని సదరు పిర్యాదు పై క్షేత్రస్ధాయిలో విచారణ చేయాలన్నారు.
భూ సమస్యలపై అధికంగా వస్తున్న ధరఖాస్తులపై ప్రత్యేక దృషిపెట్టాలని, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఎస్ఎల్ఎ పరిధిదాటకుండా వాటిని పరిష్కరించాలని సూచించారు.
ప్రతి మండలంలో అందుబాటులోవున్న ప్రభుత్వ భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంక్ లో ఉంచాలన్నారు. నీటిపన్ను వసూళ్లను నీటివినియోగదారుల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. భూసేకరణ, ఎలియేషన్ ప్రతిపాధనలు, తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించి తీసుకోవల్సిన చర్యలపై దిశా, నిర్ధేశం చేశారు.
భూసేకరణ, తదితర అంశాలపై ఏవిధమైన ఆరోపణలను ఉపేక్షించబోమని, విధానాలు మార్చుకోకపోతే నిబంధనల మేరకు కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణపై ప్రత్యేక పోకస్ పెట్టాలన్నారు.
ఇప్పటికే ఇందుకోసం నియమించిన అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా మండలస్ధాయిలో పిడిఎస్ పై మోనాటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడమే కాకుండా సదరు సమావేశానికి యండియు ఆపరేటర్లను కూడా పిలవాలన్నారు.
ప్రతినెలా 10వ తేదీ లోపు నిత్యావసరవస్తువుల పంపిణీ పూర్తిచేయాలన్నారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తహశీల్దార్లు పిడిఎస్ పంపిణీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఐసిడిఎస్ కు నాణ్యతగల బియ్యం, తదితర వస్తువులు పంపిణీ కూడా పరిశీలించాలన్నారు.
ఈ సందర్బంగా భూ రీస్వే, ఫీ హోల్డ్ అసైన్డ్ భూములు, ఎలియేషన్ కేసులు, కోర్టుకేసులు, మ్యూటేషన్స్, ఆర్ఓఆర్ అప్పీలు, రివిజన్ పిటీషన్స్ తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ లోపు నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారి పూర్తి చేయాలన్నారు.
సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డిఓలు అచ్యుత అంబరీష్, ఎం.వి. రమణ, సర్వే ఎడి ఎస్ హెచ్ యండి అన్సారీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్.ఎస్. రాజు, జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.