🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ :
2021-26 కాలానికి గాను వరద నియంత్రణ, సముద్ర కోత నిరోధక పనుల కోసం రాష్ట్రాలకు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత “వరద నిర్వహణ మరియు సరిహద్దు ప్రాంతాల కార్యక్రమం (FMBAP)”ను అమలు చేస్తోందని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి తెలిపారు. వరద నష్టాన్ని తగ్గించడం కోసం ఏలూరు సహా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ పథకాలు, కార్యక్రమాల వివరాలు కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు గురువారం లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
FMBAP కింద చేర్చడానికి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ నుండి ఎటువంటి ప్రాజెక్టు ప్రతిపాదన అందలేదన్నారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సర్వేలు నిర్వహించడంతో సహా వరద నిర్వహణ మరియు కోత నిరోధక పథకాలను వారి ప్రాధాన్యత ప్రకారం రూపొందించి అమలు చేస్తాయన్నారు. కీలకమైన ప్రాంతాలలో వరదల నిర్వహణకు సాంకేతిక మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహక ఆర్థిక సహాయం అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తోడ్పడుతుందని కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌదరి తెలిపారు.
ఏలూరు జిల్లాలోని తమ్మిలేరు, ఎర్రకాలవ మరియు కొవ్వాడ కాల్వల వరద రక్షణ పనులపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి.. రూ. 470.71 లక్షల రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు (SDMF) ఉపయోగించి ఇప్పటికే ఈ కాలువలపై వరద నిర్వహణ పనులు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియచేసినట్లు స్పష్టం చేశారు.
వరద నిర్వహణకు నిర్మాణేతర చర్యలలో భాగంగా, కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో 36 జల పరిశీలన కేంద్రాలను నిర్వహిస్తోందని, వాటిలో రెండు ఏలూరు జిల్లాలో ఉన్నాయన్నారు.
అదేవిధంగా కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో 21 వరద అంచనా కేంద్రాలను కూడా నిర్వహిస్తోందని, వాటిలో ఒకటి ఏలూరు జిల్లాలో ఉందని తెలిపారు. వరద పీడిత గ్రామాల్లో వరద నిర్వహణ మరియు భద్రతా పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రెవెన్యూ మరియు అటవీ శాఖలు, జలవనరుల శాఖతో కలిసి వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వివరించారు.

