🔴 ఏలూరు/ ఢిల్లీ : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో “పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY)” ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
PKVY పథకం కింద, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 3 సంవత్సరాలలో హెక్టారుకు రూ. 31,500 సహాయం అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి, ఇందులో రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా వ్యవసాయం/ఆఫ్-ఫామ్ సేంద్రీయ ఇన్‌పుట్‌ల కోసం హెక్టారుకు రూ. 15,000, మార్కెటింగ్, బ్రాండింగ్ కోసం హెక్టారుకు రూ.4,500, సర్టిఫికేషన్ కోసం హెక్టారుకు రూ.3,000, శిక్షణ, సామర్థ్య నిర్మాణానికి హెక్టారుకు రూ.9,000 సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా PKVY పథకంతొపాటు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా “మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER)” పథకం కింద రైతులకు ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్, సర్టిఫికేషన్ మరియు మార్కెటింగ్ వరకు ఎండ్-టు-ఎండ్ మద్దతుపై దృష్టి పెడతున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విధానాలపై ప్రశంస..
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ల్రం మేలైన విధానాలను అవలంబిస్తున్నట్లు కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ 1,089 రైతు బజార్లలో సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నారని, ఇవి మధ్యవర్తులను తగ్గించి, రైతులకు ప్రత్యక్ష మార్కెటింగ్ మార్గాలను బలోపేతం చేస్తున్నాయన్నారు.
సేంద్రీయ ఉత్పత్తులు నిల్వ చేసే సమయంలో నష్టాలను తగ్గించడానికి రాష్ట్రం ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ విషయాల్లో రైతులకు సహకారం అందించడంతోపాటు, రైతులు, బల్క్ కొనుగోలుదారులు, రిటైలర్లు మరియు సంస్థాగత వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలను సులభతరం చేయడానికి రాష్ట్రం కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలను నిర్వహిస్తోన్న విషయాన్ని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
స్వయం సహాయక బృందాలు (SHGs) ద్వారా ఇప్పటికే 59 గ్రామాలలో గృహ అవసరాల కోసం సహజ వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే విధంగా ఫుడ్ బాస్కెట్ నమూనాను అమలు చేయటం జరిగిందని, దీనిని మరో 340 గ్రామాలకు విస్తరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు. అంతేకాకుండా, రైతు అగ్రిగేటర్లు, సహజ వ్యవసాయం చేసే రైతులతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేంద్రీయ మేళాలు, ప్రదర్శనలు మరియు సమావేశాలు నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వం రైతులను ప్రోత్సహించటం అభినందనీయమన్నారు.

