🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో రోగులకు అవసరమైన, మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి (HDS) రివ్యూ మీటింగ్ శనివారం ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జరిగింది.
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, కలెక్టర్ వెట్రి సెల్వి తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆసుపత్రిలోని పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఖాళీలు వేగంగా భర్తీ చేయాలని DME కి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. సరైన వైద్యం అందించలేని పరిస్థితుల్లో అనేక మంది రోగులను విజయవాడ ఆసుపత్రికి పంపిస్తున్న పరిస్థితి మారాలని, రోగులకు ఇచ్చే మందుల సరఫరాలో లోపాలను సరిచేయాలని, పారిశుధ్య పనుల్లో శ్రద్ధ వహించాలని కోరారు.
ఏలూరు సహా, జంగారెడ్డిగూడెం, కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో పనిచేసేందుకు వైద్యులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉందన్న ఎంపీ, దీనిపై దృష్టి పెట్టి, వైద్య సిబ్బంది, పరిపాలనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని DME ను ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సి ద్వారా వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉందన్న DME తాత్కాలిక ప్రాతిపదికన అత్యవసర నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
CSR నిధులు తీసుకువచ్చి ఇటీవలే ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఎంపీ, ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన కోసం CSR నిధుల ద్వారా మరో 50 లక్షలు సమకూర్చేందుకు హామీ ఇచ్చారు. ప్రాధాన్యతా క్రమంలో ముందుగా టాయిలెట్స్, దోమతెరలు వంటి ఏర్పాట్లకు ఈ నిధులు వినియోగించాలని ఆదేశించారు. ఏలూరు ఆసుపత్రికి ఇప్పటికే ఒక అంబులెన్స్ ఇవ్వటం జరిగిందని, మరో అంబులెన్స్ త్వరలో అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఏసీ యూనిట్ పనిచేయకపోవటం సహా అనేక సమస్యలపై ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే, DME సమక్షంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. గుండె సంబంధిత రోగుల వైద్యానికి ఆసుపత్రిలో క్యాథలాబ్ ఏర్పాటు చేస్తే హుద్రోగ మరణాల సంఖ్యను తగ్గించవచ్చని, దీనికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వంతో మాట్లాడుతానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఆసుపత్రిలోని పరిస్థితులు, చేయాల్సిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక తయారు చేయాలని DME ను, ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు.

