ఏలూరు /డిల్లీ : ది డెస్క్ :
.. కృత్రిమ మేధస్సు రంగంలో భారత్ కు భారీగా పెట్టుబడులు
.. ఇప్పటివరకూ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో విశాఖలో గూగుల్ దే రికార్డు.
.. ఇండియా AI మిషన్‌తో యువతకు నైపుణ్య శిక్షణ.
.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్.
దేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా AI ప్రతిభను అందించేందుకు భారత ప్రభుత్వం AI రంగంలో నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు చేపడుతోందన్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద. వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు రంగంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడుల వివరాలు కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
స్టాన్‌ఫర్డ్ గ్లోబల్ AI వైబ్రెన్సీ 2025 నివేదిక ప్రకారం, AI పోటీతత్వం మరియు ఎకోసిస్టమ్ చురుకుదనం విషయంలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. మార్చి 2024లో భారత ప్రభుత్వం దేశంలో సమగ్ర AI ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రూ. 10,372 కోట్ల వ్యయంతో ఇండియా AI మిషన్‌ను ప్రారంభించిందన్న కేంద్ర మంత్రి 24 నెలల లోపులోనే ఇండియా AI మిషన్ దేశంలో AI ఎకోసిస్టమ్ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని తెలిపారు.
ఇందులో భాగంగా స్వదేశీ ఫౌండేషన్ మోడల్స్ లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ధి కోసం 12 బృందాలను ఎంపిక చేశామని, ప్రత్యేకమైన AI అప్లికేషన్ల అభివృద్ధికి 30 దరఖాస్తులను ఆమోదించటం జరిగిందన్నారు. విద్యార్ధుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకూ 8,000కుపైగా అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 5,000 పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు 500 పీహెచ్‌డీ విద్యార్థులకు శిక్షణా సహాయం అందించినట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు.
ఇండియా AI మిషన్ లో భాగంగా NIELIT సహకారంతో టియర్-2 మరియు టియర్-3 నగరాలలో ఇప్పటికే 27 ఇండియా డేటా మరియు AI ల్యాబ్‌లు స్థాపించగా, మరో 543 ల్యాబ్‌లను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. 27 ఇండియాAI డేటా మరియు AI ల్యాబ్‌లు స్థాపించబడ్డాయి. వీటిలో డేటా అనోటేషన్, డేటా క్యూరేషన్, డేటా క్లీనింగ్, డేటా సైన్స్ వంటి రంగాలలో ప్రాథమిక స్థాయి కోర్సులు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
విశాఖలో గూగుల్ రికార్డు..
AI రంగంలో పెట్టుబడులపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. స్టాన్‌ఫర్డ్ AI ఇండెక్స్ రిపోర్ట్ 2025 ప్రకారం, 2013 నుండి 2024 వరకు భారత్‌లో AI రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు సుమారు 11.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయని తెలిపారు. గూగుల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను స్థాపిస్తున్నట్లు ప్రకటించిందని, సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల ఈ పెట్టుబడి ఇప్పటివరకు భారత్‌లో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచిందన్నారు.
ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలతో సంప్రదింపులు జరిపి కోర్సుల రూపకల్పన చేస్తున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి, సామర్థ్యాలకు అనుగుణంగా ఎప్పుడైనా, ఎక్కడైనా నైపుణ్య సర్టిఫికేట్లు పొందేందుకు పోర్టల్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఈ పోర్టల్ లో ఇప్పటివరకు 26.2 లక్షలకుపైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 16.65 లక్షలకుపైగా అభ్యర్థులు వివిధ కోర్సుల్లో చేరి/శిక్షణ పొందారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వివరించారు. కేంద్రం మంత్రి సమాధానంపై స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. “ఇండియా AI మిషన్”తో దేశ ఐటీ రంగ రూపురేఖలు మారటంతో పాటు, యువత భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

