The Desk … Eluru : ‎బస్సు ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు – ఎంపీ పుట్టా మహేష్

The Desk … Eluru : ‎బస్సు ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు – ఎంపీ పుట్టా మహేష్

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

పెరుగుతున్న ప్రైవేటు బస్సు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఏలూరు ఎంపీ.

రహదారి భద్రతా నిబంధనలు, పర్యవేక్షణపై లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ.

19 రాష్ట్రాల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ విధానం.

బస్సు ప్రమాదాల్లో ఏపీ 11వ స్థానంలో ఉందన్న కేంద్రం.


ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై, ముఖ్యంగా ప్రైవేటు బస్సుల ప్రమాదాలు పెరిగిపోతుండటంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులపై బస్సు ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలు, రోడ్డు భద్రతా నిబంధనల వివరాలు కోరుతూ లోక్ సభలో గురువారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సవివరంగా సమాధానం ఇచ్చారు.

రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా బస్సు ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి గడ్కరీ కేంద్ర మోటారు వాహనాల నియమాలు-1989 ప్రకారం, రవాణా వాహనాలు నిర్దిష్ట ప్రమాణాలు కలిగి ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, వాహనం కొనుగోలు తర్వాత మొదట ఎనిమిది సంవత్సరాలు రెండేళ్లకోసారి, ఆ తర్వాత ప్రతీ ఏడాది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని తెలిపారు.

మోటారు వాహనాలు చట్టం ప్రకారం ప్రతి బస్సులో అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ వంటివి కలిగి ఉండాలి. అదేవిధంగా అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే వాహనాలకు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ రూల్స్- 2023 నియమాలను అమలు చేయాలి. వాహన భద్రత చట్టంలో భాగంగా ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతను పెంచేందుకు ప్రైవేటు బస్సులు సహా ప్రజా రవాణా వాహనాలు అన్నిటిలో వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు (VLTD) మరియు అత్యవసర బటన్లను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాల విధానాన్ని అమలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.

ప్రైవేటు బస్సు ప్రమాదాల వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాత పూర్వకంగా వివరాలను అందించారు. ప్రైవేటు బస్సు ప్రమాదాల వివరాలు ప్రత్యేకంగా రికార్డు చేయలేదన్న కేంద్ర మంత్రి, అన్ని రాష్ట్రాల నుంచి తీసుకున్న లెక్కల ప్రకారం మొత్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న బస్సు ప్రమాదాల్లో ఏపీ 11వ స్థానంలో ఉందన్నారు.

కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం 2020 నుంచి 2024 వరకు జరిగిన బస్సు ప్రమాదాల లెక్కలను పరిశీలిస్తే  2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 12,334 బస్సు ప్రమాదాలు జరుగగా,  338 ప్రమాదాలతో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది.  అత్యధికంగా 2,367 ప్రమాదాలతో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, 1896 ప్రమాదాలతో కేరళ రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో 338 బస్సు ప్రమాదాలు జరిగితే, 2023లో 288, 2022లో 447, 2021లో 305, 2029లో 251 బస్సు ప్రమాదాలు జరిగాయి.