The Desk … Eluru : ‎డిజిటల్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk … Eluru : ‎డిజిటల్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను వారి ఇంటి వద్దకే అందించేందుకే డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కింద పనిచేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT), అక్టోబర్ 2025లో “NIELIT డిజిటల్ యూనివర్సిటీ (NDU) ప్లాట్‌ఫామ్”ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దీని కార్యక్రమాలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సుకాంత మజుందార్  సమాధానం ఇస్తూ”NIELIT డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్‌ఫామ్” అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో ఆన్‌లైన్ మరియు మిశ్రమ నైపుణ్య-ఆధారిత కోర్సులను అందించడానికి ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అని పేర్కొన్నారు. సెమీకండక్టర్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఇండస్ట్రీ 4.0 మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న డొమైన్‌లలో రియల్-టైమ్ ప్రయోగాల కోసం ఈ ప్లాట్‌ఫామ్ వర్చువల్ ల్యాబ్‌లను కూడా కలిగి ఉన్నట్లు తెలిపారు.

ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోని కోర్సులు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF)కి అనుగుణంగా ఉంటాయి. క్రెడిట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC)కి బదిలీ చేయబడతాయి. ప్రస్తుతం NDU ప్లాట్‌ఫామ్‌లో 100 కంటే ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన కేంద్ర మంత్రి, వీటిని దేశవ్యాప్తంగా NIELIT యొక్క 56 కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు.

అంతేగాకుండా కోర్సులను నేర్చుకోవడంతోపాటు  వారు తిరిగి నైపుణ్యాన్ని పెంచుకోవడం మరియు ఉపాధికి అవకాశాలను పొందటానికి “స్వయం ప్లస్” (SWAYAM)  ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. స్వయం ప్లస్ ద్వారా ఇప్పటివరకూ ప్రముఖ పరిశ్రమలతో 89 కంటే ఎక్కువ అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు, ఇప్పటివరకూ 4.84 లక్షల మంది తమ నైపుణ్య పెంపుదల కోసం దీనిలో పేర్లు నమోదు చేసుకున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వెల్లడించారు.