🔴 ఏలూరు జిల్లా : కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :

ఇతర జిల్లాలతో పోల్చితే ఏలూరు జిల్లాలో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉందని, పంటల బీమా ప్రీమియం కూడా ఎక్కువగా ఉందని, తగ్గించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జరిగిన బ్యాంకర్ల (LDM) సమీక్షా సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. వ్యవసాయ రుణాలు, ఎమ్ఎస్ఎమ్ఈ, పీఎం స్వానిధి లాంటి రుణాల అమలు తీరుపై బ్యాంకర్లను అడిగి తీసుకున్నారు. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై బ్యాంకుల ప్రతినిధులు ఎంపీ, ఎమ్మెల్యేలకు నివేదికను అందజేశారు.
2025-26 సంవత్సరానికి జిల్లాలో బ్యాంకులకు నిర్దేశించబడిన వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ. 21,261 కోట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ రుణాలకు కేటాయింపు రూ. 13,845 కోట్లు. మొత్తం ప్రణాళిక వ్యయంలో ఇది 65.11%. డిసెంబర్, 2025 నాటికి బ్యాంకులు డిఆర్డిఏ పరిధిలోని 15,535 గ్రూపులకు రూ. 1,421.17 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటివరకూ 13,562 గ్రూపులకు రూ. 1,233.67 కోట్లు ఆర్థిక సహాయం అందించాయి. 2025-26 ఆర్థిక సంవత్సర లక్ష్యంలో ఇది 77.13%. మెప్మా పరిధిలోని 2,050 గ్రూపులకు రూ. 205 కోట్ల లక్ష్యానికి గాను, 1,127 గ్రూపులకు రూ. 134.63 కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు బ్యాంకర్లు తెలియచేశారు.
పీఎం సూర్యఘర్ పథకంలో రుణ తిరస్కరణలు ఎక్కువగా ఉండటంపై బ్యాంకుల ప్రతినిధులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రశ్నించారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఇచ్చే రుణ పరిమితి పెంచే విషయం పరిశీలించాలని బ్యాంకర్లను ఎంపీ కోరారు. బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని కోరారు.
చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణ సహాయం అందించేందుకు తెచ్చిన పీఎంఈజిపి వంటి అనేక కేంద్ర పధకాల గురించి ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని, వీటిపై ప్రజలకు అవగాహన కలిగేందుకు బ్యాంకుల ప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. ఇతర జిల్లాలతో పోల్చితే ఏలూరు జిల్లాలో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉందని, పంటల బీమా ప్రీమియం కూడా ఎక్కువగా ఉందని, తగ్గించాలని, బ్యాంకర్లకు సూచించిన ఎంపీ, రుణాల వసూళ్లపై కూడా శ్రద్ధ వహించాలని బ్యాంకుల ప్రతినిధులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, కలెక్టర్ వెట్రి సెల్వి, బ్యాకింగ్ రంగ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

