- ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ప్రజా దర్బార్.
-
- భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు.
-
- జ్యూట్ మిల్లు కార్మికులకు ఈఎస్ఐ నుంచి రావాల్సిన బకాయిలపై ఎంపీ తీపి కబురు.
-
- పొగాకు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హమీ ఇచ్చిన ఎంపీ
ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఏలూరు పార్లమెంటు పరిధిలోని వివిధ వర్గాల నుంచి తన దృష్టికి వచ్చిన వినతులను కేంద్ర మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఎంపీ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ప్రజా దర్బార్ నిర్వహించారు. 50 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించిన ఎంపీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఏలూరు పార్లమెంట్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. గత 18 నెలల్లో తన కార్యాలయం నుంచి 5 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి రికార్డు సృష్టించామన్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలో ఏలూరు నియోజకవర్గానికి చెందిన అనేక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో విజయం సాధించామని చెప్పారు. జ్యూట్ మిల్లు కార్మికులకు ఈఎస్ఐ నుంచి రావాల్సిన బకాయిల కోసం కేంద్ర మంత్రితో మాట్లాడటంతో మొదటి విడత బకాయిలు విడుదలయ్యాయని తెలిపారు. అదేవిధంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ ను కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ వివరించారు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు 2.5 కోట్ల సీఎస్ఆర్ నిధులు తీసుకువచ్చానాని, భవిష్యత్తులో మరిన్ని సీఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి వివిధ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డు, కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ అంశాలపై కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నట్లు చెప్పిన ఎంపీ, త్వరలో శుభవార్త వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
పొగాకు రైతుల ఆందోళన :
కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై విధించిన భారీ పన్నులతో పొగాకు పంటకు ధరలు తగ్గి నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్న పొగాకు రైతు సంఘాలు ఏలూరు ఎంపీని కలిసారు. పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతుల జీవనోపాధికి భంగం కలగకుండా రెవెన్యూ-పన్నుల విధానాలను మార్చాలని డిమాండ్ చేశారు. గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, సిగరెట్ల పొడవు ఆధారంగా వెయ్యి సిగరెట్లకు రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నోటిఫై చేసిన విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
భారీ ర్యాలీగా తన కార్యాలయానికి తరలి వచ్చిన పొగాకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమస్యపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చర్చించారు. రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని, అదే సందర్భంలో పొగాకు రైతుల కష్ట నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వారికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
సరిపల్లి రోడ్డు నిర్మాణంపై ఎంపీకి కృతజ్ఞతలు :
పోలవరం నియోజకవర్గం సరిపల్లి, బయ్యన్నగూడెం, డిప్పకాయలపాడు గ్రామాలకు చెందిన ప్రజలు, స్థానిక నేతలు పలువురు మంగళవారం ఎంపీను కలిశారు. హమీ ఇచ్చిన విధంగా సరిపల్లి రోడ్డు నిర్మాణం పూర్తి చేసినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూడు పంచాయతీల పరిధిలోని గ్రామాలలో 30 వేలమంది ప్రజలు 30 ఏళ్లుగా సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక నేతలు గతంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఎంపీ వెంటనే పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, టిడిపి ఇన్చార్జ్ బోరాగం శ్రీనివాస్ లతో మాట్లాడి రోడ్డు మంజూరు చేయించటం జరిగింది.
రోడ్డు మంజూరు చేయించటమే కాకుండా, నిర్మాణ పనులు కూడా వేగంగా జరిగేలా కృషి చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. రెండు నెలలలోనే రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయా పంచాయతీలకు చెందిన ప్రజలు కూటమి నాయకులు పారేపల్లి నరేష్ , అనేం సాయిబాబు,ఆరేటి ఏసుబాబు , సింగంశెట్టి సుబ్బారావు, మాదాసు సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.
ఎంపీ చొరవతో వేగంగా పనులు పూర్తయ్యి, 3 పంచాయతీలకు చెందిన 30 వేల మంది ప్రజల రోడ్డు కష్టాలు తీరాయని సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు కష్టాలు తొలగించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, టిడిపి ఇన్చార్జ్ బోరాగం శ్రీనివాస్ లకు వారు ధన్యవాదాలు తెలిపారు.
కాగా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ప్రజా దర్బార్ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలతో మంగళవారం ఎంపీ క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఆనేక మండలాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎంపీ సమావేశయ్యారు. తమ ప్రాంతాలకు సంబంధించిన పలు అంశాలను వారు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.

