The Desk…Eluru : జిల్లాలో గుంతల రోడ్లకు మోక్షం…ఫలించిన ఎంపీ కృషి

The Desk…Eluru : జిల్లాలో గుంతల రోడ్లకు మోక్షం…ఫలించిన ఎంపీ కృషి

  • జిల్లాలో 59.68 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అనుమతుల మంజూరు.
  • ‎ఎనిమిది నెలలుగా ఎంపీ చేస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.
  • ‎ఏలూరు జిల్లా రహదారులకు ప్రత్యేకంగా 23.10 కోట్లు కేటాయింపు.
  • ‎ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రాష్ట్రంలో రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పలు రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు మంజూరు చేసింది.  ఇందులో దాదాపు 300 కోట్లు గతంలో మంజూరు చేసి, పనులు ప్రారంభించకపోవడంతో రద్దైనవి కాగా, 205.12 కోట్లకు తాజాగా పరిపాలనా అనుమతులు ఇచ్చారు.

కొత్తగా పరిపాలనా అనుమతులు ఇచ్చిన 205.12 కోట్లలో 117.89 కోట్లు జిల్లా ప్రధాన రహదారులకు, 87.23 కోట్లు రాష్ట్ర రహదారులకు కేటాయించారు. దీనిపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందనీ, గ్రామీణ ప్రాంత రోడ్లకు ఒక్క రూపాయి కేటాయించలేదనీ ఎంపీ విమర్శించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు అనుసంధానంగా ఉన్న రోడ్లన్నింటినీ నిర్లక్ష్యం చేసిందన్న ఎంపీ, ఎక్కడికక్కడ గుంతలు పడి అడుగుకో గొయ్యి ఏర్పడడంతో గత ఐదేళ్లు వాహన దారులు నరకయాతన పడ్డారన్నారు. ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ఆసుపత్రి పాలైన ఘటనలు ఎన్నో. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. బాగా పాడైన రోడ్లను తొలుత మార్చాలని భావించి ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తూ వస్తోంది.

ఏలూరు పార్లమెంట్ పరిధిలో రోడ్ల పరిస్థితిపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగిందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, తాజాగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు మంజూరు చేసిన నిధుల్లో 10శాతం ఏలూరు జిల్లాకే కేటాయించిన ముఖ్యమంత్రికి, రోడ్లు భవనాల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారుల మరమ్మతుల పనులు ఈ వేసవికాలంలోపు పూర్తిచేసే విధంగా రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

‎ఏలూరు జిల్లాలో..రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన పరిపాలనా అనుమతుల్లో ఏలూరు జిల్లాకు సంబంధించిన 59.68 కిలోమీటర్ల మేర రహదారులను పునర్నిర్మించనున్నారు. జిల్లాలో వివిధ రహదారులకు మొత్తం 23.10 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో 46.29 కిలోమీటర్ల మేర నిర్మించబోయే జిల్లా ప్రధాన రహదారులకు 15.10 కోట్లు, 13.39 కిలోమీటర్ల మేర నిర్మించబోయే రాష్ట్ర రహదారులకు 8 కోట్లు కేటాయించారు. తీవ్రంగా దెబ్బతిన్న రహదారులను బాగుచేసేందుకు తక్షణ అవసరాల నిమిత్తం ఈ నిధులను వినియోగిస్తారు.

‎ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసిన జిల్లా ప్రధాన రహదారుల వివరాలను పరిశీలిస్తే.. చింతలపూడి- కామవరపుకోట మధ్య రహదారిలో పాడైన చోట్ల 5.9 కిలోమీటర్ల మేర, పొంగుటూరు- లక్కవరం మధ్య (4.4 కి.మీ), కోడూరు- చౌటుపల్లి (5.6 కి.మీ) నూజివీడు- రావిచెర్ల (4.95 కి.మీ), నిడమర్రు – చిననిండ్రకొలను (1.6 కి.మీ), ధర్మాజీగూడెం- జీలకర్రగూడెం, మరియు రంగాపురం- తడికలపూడి రోడ్లు (18.55 కి.మీ)  దాకారం (4.09 కి.మీ)  జంగంగూడెం – ముసనూరు మధ్య 1.20 కిలోమీటర్ల మేర రహదారులను పునర్నిర్మించనున్నారు.

రాష్ట్ర రహదారుల్లో ఏలూరు- జంగారెడ్డిగూడెం మధ్య బాగా దెబ్బతిన్న 5.79 కిలోమీటర్లు మరియు మేడిశెట్టివారిపాలెం – ఏలూరు రోడ్డు మధ్య పాడైన 7.6 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు.  ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాడైన రహదారులకు ఇప్పటికైనా మోక్షం కలుగుతున్నందుకు జిల్లా ప్రజానీకంలో ఆనందం వ్యక్తం అవుతోంది.  ప్రతీ సమావేశంలోనూ జిల్లా రోడ్ల సమస్యను ప్రస్తావించటమే కాకుండా, ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు మంజూరు చేయించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు.