🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
దేశవ్యాప్తంగా మొత్తం 1440 వాణిజ్య కోర్టులు ఉండగా ఆంధ్రప్రదేశ్లో రెండు వాణిజ్య కోర్టులు పనిచేస్తున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. వాణిజ్యపరమైన వివాదాల కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లో ఉంటున్న విషయాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం లోక్ సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఏలూరు ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. వాణిజ్య దావాల కేసులు త్వరగా తేల్చేందుకే ప్రత్యేకంగా “వాణిజ్య న్యాయస్థానాల చట్టం – 2015” తీసుకువచ్చామని చెప్పారు.
కేంద్ర న్యాయ మంత్రి చెప్పినదాని ప్రకారం, దేశంలో 5- 10 ఏళ్ల మధ్య పెండింగ్లో ఉన్న వాణిజ్య కేసుల సంఖ్య 1604 గా ఉండగా, పది నుంచి 15 ఏళ్ల వరకూ పెండింగ్ లో ఉన్న కేసులు 91, 15 ఏళ్లకు పైన పెండింగ్ లో ఉన్న కేసులు 23 వరకు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే వాణిజ్య పెండింగ్ కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విశాఖపట్నం మరియు విజయవాడలో రెండు వాణిజ్య కోర్టులు నడుస్తున్నాయని చెప్పిన కేంద్ర మంత్రి, వాణిజ్య న్యాయస్థానాల చట్టం 2015, సెక్షన్ 3 నిబంధనల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత హైకోర్టులతో సంప్రదించి అవసరమని భావించిన చోట్ల వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి తెలియచేశారు.

