🔴 ఏలూరు/ ఢిల్లీ : ది డెస్క్ :
డిజిటల్ బంగారం పేరుతో కొన్ని సంస్థలు స్వీకరిస్తున్న పెట్టుబడుల భద్రతపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై లోక్ సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. సెక్యూరిటీ మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారులకు ఉండే రక్షణ విధానాలు డిజిటల్/ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లు నిర్వహించే బంగారం పెట్టుబడులకు లేవని తెలిపారు. స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కూడా వీటికి బాధ్యత వహించదని మంత్రి స్పష్టం చేశారు.
2020 నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా డిజిటల్ గోల్డ్ పెట్టుబడులపై జాతీయ వినియోగదారుల సేవాకేంద్రానికి అందిన ఫిర్యాదుల వివరాలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర మంత్రి.. డిజిటల్ గోల్డ్ పై గత ఆరేళ్లలో దేశ వ్యాప్తంగా 371 ఫిర్యాదులు అందాయని, ఈ ఫిర్యాదులు అందిన రాష్ట్రాల్లో మొత్తం 38 ఫిర్యాదులతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా 17 ఫిర్యాదులతో ఏపీ 9వ స్థానంలో ఉందని వెల్లడించారు.
ఈ డిజిటల్ బంగారం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి వ్యక్తుల, సంస్థల వివరాలు ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర మంత్రి తెలిపారు. దీనిపై మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భౌతికంగా బంగారంపై పెట్టుబడులకు డిజిటల్ గోల్డ్ ప్రత్యామ్నాయంగా ఎంచుకునే ముందు డిజిటల్ గోల్డ్/ఈ గోల్డ్ అంటూ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లలో వచ్చే ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని, అటువంటి పెట్టుబడులకు ప్రభుత్వ గ్యారంటీ లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు.
అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్, రష్యా మార్కెట్ :
భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావాన్ని అంచనా వేయండి.
ఆక్వా ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఇతర మార్కెట్లకు ఎగుమతులు పెంచేందుకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
ఇటీవల అమెరికా విధిస్తున్న భారీ సుంకాల ప్రభావంపై అంచనా వేసేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ ఆర్ధిక సంస్థలతో చర్చిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం, భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతుల పరిమాణం 2023 ఏప్రిల్ – నవంబర్లో 278.80 బిలియన్ డాలర్లు ఉండగా ఇదేకాలానికి 2024లో 284.60 బిలియన్ డాలర్లుగా, 2025 ఏప్రిల్ – నవంబర్ లో 292.07 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అంటే స్వల్పంగా వృద్ధి నమోదు అయినట్టు తెలుస్తుంది.
ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా ప్రశ్నించగా.. భారతదేశం నుంచి గత ఏడాది ఏప్రిల్- నవంబర్లో 4.95 బిలియన్ డాలర్ల విలువైన ఆక్వా ఉత్పత్తిల ఎగుమతి జరగగా 2025 ఏప్రిల్ – నవంబర్ మధ్య 5.75 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు మంత్రి తెలిపారు.
ఆక్వా ఎగుమతుల పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ స్వల్పంగా వృద్ధి నమోదవ్వటం విశేషం. పదేళ్ల కిందటితో పోల్చితే భారతీయ ఆక్వా ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. 2013- 14 ఏడాదిలో 30,213 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా, 2024- 25లో 62,408 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి 2023- 24 ఏడాదిలో మొత్తంగా 19,759.86 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరగగా 2024- 25 ఏడాదికి 20,782.81 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఎగుమతి దారులను ప్రోత్సహించేందుకు క్రెడిట్ గ్యారెంటీ పథకం, నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్ (NCGTC) ద్వారా 100% క్రెడిట్ గ్యారెంటీ సౌకర్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం భారతీయ ఎగుమతిదారుల ప్రపంచ పోటీ తత్వాన్ని పెంచుతుందని, కొత్తగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు.
భారతీయ ఎగుమతులను 1 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలనే లక్ష్యం దిశగా వివిధ దేశాలతో, వాణిజ్య కూటములతో 15 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు మరియు 6 ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకం చేసినట్టు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా సుంకాల పెంపు చర్యల యొక్క పరిమాణ ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.
అమెరికా సుంకాల ప్రభావం ముఖ్యంగా ఆక్వా పరిశ్రమపై ఏ విధంగా ఉందంటూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ గతంలో మత్స్య సంపద ఎగుమతులు అమెరికాకు అధిక స్థాయిలో ఉండగా సుంకాల ప్రభావంతో యూరోపియన్ దేశాలు మరియు రష్యాకు ఎగుమతులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

