- దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యం.
- ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరకూ 1లక్షకు పైగా యువతకు శిక్షణ.
- ఏలూరు జిల్లాలో 54 నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు.
- ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి సమాధానం.
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
స్కిల్ ఇండియా మిషన్ ద్వారా యువత కోసం దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు వివరాలు కోరుతూ లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్ (SIM) కింద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ(MSDE) పలు పథకాల ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY), జన శిక్షణ్ సంస్థాన్ (JSS), నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్స్ స్కీం (NAPS) మరియు క్రాఫ్ట్స్ మెన్ ట్రైనింగ్స్ స్కీమ్ (CTS) అంటే వివిధ పథకాల కింద నైపుణ్యాభివృద్ధి కేంద్రాల విస్తృత నెట్వర్క్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాల్లోనూ నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
భారత దేశంలోని యువత భవిష్యత్తులో పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాలతో సర్వసన్నద్ధం అయ్యేలా చేయడం స్కిల్ ఇండియా మిషన్ (SIM) యొక్క ఉద్దేశ్యం అన్నారు. మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాల్లో యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్థానిక నైపుణ్య అవసరాలను గుర్తించడం మరియు గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు శిక్షణ లక్ష్యాలను కేటాయించడం కోసం జిల్లా నైపుణ్య కమిటీలు (DSCs) ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
PMKVY కింద గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రభుత్వ విద్యాసంస్థల్లో నైపుణ్య కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన మంత్రి, అదేవిధంగా భారత ప్రభుత్వం నుండి 100% గ్రాంట్ తో రిజిస్టర్ సొసైటీలు, ఎన్జీవోల ద్వారా లబ్ధిదారుని ఇంటి వద్దే అనధికార రీతిలో నైపుణ్య శిక్షణ అందించటం లక్ష్యంగా JSS పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో PMKVY కింద లక్షకు పైగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఏలూరు జిల్లాలో 54 నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

