The Desk…Eluru : ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం మనది – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం మనది – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

బుధవారం నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ.. దేశ చరిత్రలోనే ఈరోజు ఎంతో గొప్ప రోజని, 1949 నవంబర్ 26న  రాజ్యాంగ సభచే ఆమోదించబడి 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక మైలురాయిగా మారిందనటంలో సందేహం లేదన్నారు. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను ఇస్తుంది, మన బాధ్యతలను వివరిస్తుంది మరియు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం యొక్క విలువలను తెలియచేస్తుందన్నారు ఏలూరు ఎంపీ.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకుని అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. మేధస్సుతోపాటు మానవత్వం కూడా కలిసిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంబేద్కర్ అంటూ ఎంపీ ప్రస్తుతించారు.

బడుగు వర్గాల కోసం ముఖ్యంగా దళితుల జీవితాన్ని మార్చేందుకు అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోశారని, అంటరానితనానికి వ్యతిరేకంగా దళితుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు మనందరం సమాన హక్కులు, స్వేచ్ఛ అనుభవిస్తున్నామన్నారు. ఎన్నో గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ తన ప్రతిభను తన తెలివితేటలను భారత దేశ అభివృద్ధికి, సమానత్వం కోసం ధారబోసిన వ్యక్తి అంబేద్కర్ అని, అందుకే ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.

అంబేద్కర్ సహా అనేకమంది పెద్దలు ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారన్న ఎంపీ, దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి పొరుగు దేశాల్లో మాదిరి మనదేశంలో అంతర్గత తిరుగుబాట్లు, రాజ్యాంగ వ్యవస్థలు పతనం వంటివి  జరగకపోవడానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలే అన్నారు. ఇటువంటి పవిత్రమైన రోజున రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులు అర్పిద్దామని, ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజూ మన చర్యలు, చట్టం పట్ల గౌరవం ద్వారా మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.