🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 11.30 సమయంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎంపీ దాదాపు 45 నిమిషాలు అన్ని విభాగాలను కలియ తిరిగి పలువురు రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పలువురు రోగులకు, వారి సహాయకులకు తన ఫోన్ నెంబర్ తో కూడిన విజిటింగ్ కార్డును స్వయంగా ఇచ్చిన ఎంపీ.. సరైన వైద్యం అందకపోయినా, ఆసుపత్రిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా తనకు నేరుగా ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ఐసీయూ, అత్యవసర విభాగాలలో అందుతున్న సేవలను పరిశీలించిన ఎంపీ రాత్రి డ్యూటీ రిజిస్టర్ తనిఖీ చేసి, విధుల్లో ఉన్న డాక్టర్లు, ఇతర ఆసుపత్రి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు, నర్సులతో మాట్లాడుతున్న సందర్భంలో.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు నర్సింగ్ సిబ్బంది. ప్రభుత్వంతో, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి సిబ్బంది కొరత తొలగించేందుకు ప్రయత్నిస్తానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు.

