The Desk…Eluru : ప్రశ్న మీది – గొంతు నాది

The Desk…Eluru : ప్రశ్న మీది – గొంతు నాది

  • ‎ప్రజలనుంచి సమస్యలను తెలుసుకుని పార్లమెంట్ లో అడిగేందుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొత్త ప్రయోగం.

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎక్కడ ఏ సమస్య తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందించి, సమస్య పరిష్కారం అయ్యేవరకూ పట్టువదలకుండా పనిచేయడం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నైజం. ఆయితే ఏ నియోజకవర్గంలోనైనా కొన్ని సమస్యలు నాయకుల దృష్టికి రాకుండానే ఉండిపోతాయి. కొన్ని సమస్యలు నాయకుల దృష్టికి తెచ్చినా పలు కారణాల వల్ల దీర్ఘకాలం పరిష్కారానికి  నోచుకోవు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధమున్న సమస్యలను పరిష్కరించుకునే విధానం తెలియక ప్రజలు, స్థానిక నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

తన దృష్టికి రాని, పరిష్కరించాల్సిన సమస్యలను లోక్ సభలో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వినూత్న మార్గం ఎంచుకున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రశ్నలను బహిరంగ ప్రకటన ద్వారా విద్యార్థులు, ప్రజల నుంచి ఆహ్వానించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, “మీ ఎంపీ పార్లమెంట్లో ఏ ప్రశ్న అడగాలి?” అని పంపే ప్రశ్నల్లో ఎంపికైన వాటిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్లో అడుగుతారు. విద్యార్థులు, ప్రజల నుంచి వచ్చిన వాటిలో ఉత్తమ ప్రజా ప్రయోజనంగల కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి, వాటిని ఏలూరు జిల్లా ప్రజల తరఫున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తారు. ప్రశ్నలు పంపించే కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని విద్యార్థులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

ప్రశ్నలు ఆహ్వానించటమే కాకుండా, ఎంపికైన ప్రశ్నలు రాసిన వారిని చట్టాలను రూపకల్పన చేసే భారతదేశ అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంట్ కి ఆహ్వానించి, ఒక రోజు విజిటర్స్ గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తానని ప్రకటించారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏలూరు పార్లమెంట్ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రశ్నలను పంపాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్  కోరారు.

ప్రజలు పంపాల్సిన ప్రశ్నలను నేరుగా ఏలూరు క్యాంపు కార్యాలయ ఫోన్ నంబర్స్: +91 9618194377, +91 9885519299 నంబర్లకు వాట్సప్ ద్వారా పంపవలసిందిగా సూచించారు.