The Desk…Eluru : ‎భారత్ లో పెట్టుబడులకు అపార అవకాశాలు ➖నార్వే వ్యాపారవేత్తలతో ఎంపీ పుట్టా

The Desk…Eluru : ‎భారత్ లో పెట్టుబడులకు అపార అవకాశాలు ➖నార్వే వ్యాపారవేత్తలతో ఎంపీ పుట్టా

🔴 ఏలూరు/ఓస్లో- నార్వే : ది డెస్క్ :

నార్వే అధికారిక పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఏడుగురు సభ్యుల భారత ఎంపీల బృందం సోమవారం, మంగళవారంలలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు, సదస్సులలో బిజీ బిజీగా పాల్గొన్నారు. సోమవారం ఉదయం రాజధాని ఓస్లోలోని ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ భవనంలో  “సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ” వారు నిర్వహించిన “లింగ సమానత్వంలో నార్వే ప్రయాణం” అనే ప్రత్యేక కార్యక్రమంలో భారత ఎంపీల బృందం పాల్గొన్నారు. 

మధ్యాహ్నం నార్వే ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ తో ఇప్పటికే వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న పలువురు వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో పెట్టుబడులకు గల అవకాశాలను నార్వే పారిశ్రామికవేత్తలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు.

140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్ పై దృష్టి పెట్టాలని నార్వే పారిశ్రామికవేత్తలను ఎంపీ కోరారు.  సాయంత్రం నాలుగు గంటల సమయంలో  నార్వే డైరెక్టర్ ఫర్ చిల్డ్రన్ యూత్ అండ్ ఫ్యామిలీ ఎఫైర్స్ వారు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లింగ సమానత్వం కోసం నార్వే అనుసరించిన విధానాలు, అందులో ఎదురైన సవాళ్లు, అమలుచేస్తున్న చట్టాలపై నార్వే అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భారత బృందానికి వివరించారు. .

పర్యటన మూడోరోజు మంగళవారం భారత ఎంపీలు నార్వే పార్లమెంట్ ను సందర్శించారు. దేశ పార్లమెంట్ లో వివిధ సభా సంఘాలతో  సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక, రక్షణ, పరిశ్రమలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న పుట్టా మహేష్ కుమార్ బృందం పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును సభా గ్యాలరీల నుండి వీక్షించారు.

నార్వేయన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ (NORAD) ఆధ్వర్యంలో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ఎంపీల బృందం పాల్గొంది. సమావేశంలో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డిజిటలైజేషన్ ద్వారా భారతదేశంలో అమలు చేస్తున్న సేవలను వివరించారు.