The Desk…Eluru : పోలవరం నిర్వాసితులకు న్యాయం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : పోలవరం నిర్వాసితులకు న్యాయం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

  • పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేస్తున్నాయి
  • పోలవరం నిర్వాసితులకు ముందుగానే దీపావళి పండుగ
  • 1,100 కోట్ల పరిహారం చెల్లింపుతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో నూతన వెలుగులు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో భాగంగా తాజాగా గురువారం నాడు రూ: 1,100 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

తమ ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అయిన విషయం తెలుసుకుని, కృతజ్ఞతలు తెలియచేస్తూ కుక్కునూరు, వేలేరుపాడు, దేవీపట్నం మండలాలకు చెందిన నిర్వాసిత కుటుంబాల నుంచి పలువురు ఎంపీ కార్యాలయానికి ఫోన్లు చేయగా, స్పందించిన ఎంపీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేలోపే ప్రతి ఒక్క నిర్వాసితునికి కూడా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తిచేసేందుకు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో, నిర్వాసితులకు న్యాయం చేసేందుకు కూడా అంతే చిత్తశుద్ధితో ఉన్నారన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వాసితుల పరిహారం విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఈ ఏడాది జనవరిలోనే 1,000 కోట్ల పరిహారం నిధులు తమ ప్రభుత్వం విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఈ దీపావళి పండుగ ముందు తాజాగా మరో రూ: 1,100 కోట్లు విడుదల చేయటం నిర్వాసితుల కుటుంబాల్లో ఆనందాన్ని, వెలుగులను నింపుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇంకా పరిహారం అందాల్సినవారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి గానీ, ఇళ్ళ నష్టపరిహారానికి సంబంధించి గానీ ఇంకా పెండింగులో ఉన్న బిల్లులతో పాటు కొత్తగా పెట్టబోయే బిల్లులను ప్రభుత్వానికి సమర్పిస్తే, నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.

అన్ని విషయాల్లో రాష్ట్రానికి మద్దతుగా నిలుస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, యువనేత, మంత్రి నారా లోకేష్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.‎