🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఆర్వోబీలు నిర్మించే ప్రాంతాలను పరిశీలించిన అధికారులు, నేతలు.వట్లూరు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) కి కూడా త్వరలో గ్రీన్ సిగ్నల్!ఆర్వోబీలు నిర్మించ తలపెట్టిన పూళ్ల, కైకరం, పి.కన్నాపురం రైల్వే గేట్ల ప్రాంతాలను బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, రైల్వే, నేషనల్ హైవే అధారిటీ, రెవెన్యూ అధికారులు, కలిసి సందర్శించారు.

ఏలూరు పార్లమెంట్ పరిధిలో పలు రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రంతో మాట్లాడి ఇటీవల 13 ఆర్వోబీలు మంజూరు చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్వోబీలు నిర్మించ తలపెట్టిన కొన్ని రైల్వే గేట్లకు సంబంధించి కొత్త విజ్ఞప్తులతో కొంతమంది ప్రజానీకం ఇటీవల ఎంపీను కలవటం జరిగింది. ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులపై రైల్వే, నేషనల్ హైవే అధారిటీ, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఆయా రైల్వే గేట్ల ప్రాంతాలను స్వయంగా సందర్శించి ఆర్వోబీల అలైన్మెంట్ లలో మార్పులు చేయాల్సిందిగా కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించారు. ఎంపీ ఆదేశాల మేరకు బుధవారం రైల్వే అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్డీవో సహా రెవెన్యూ అధికారులు పూళ్ల, కైకరం, పి.కన్నాపురం గ్రామాల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించబోయే ప్రాంతాలను సందర్శించారు. పి.కన్నాపురం వద్ద ఆర్వోబీ నిర్మించే సందర్భంగా రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు మూసివేస్తే, అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
రెండు హైవేలను కలుపుతూ 8 గ్రామాల మీదుగా వెళ్ళే ఈ రహదారి ప్రాధాన్యతను గ్రామాల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా కైకరం గేటు వద్ద నిర్మించే ఆర్వోబీ వల్ల కొన్ని నివాస గృహాలకు నష్టం జరుగుతున్న దృష్ట్యా ఆర్వోబీ అలైన్మెంట్ మార్చాలని స్థానికులు కోరారు. వీటితోపాటు పూళ్ళ రైల్వే గేట్ ప్రాంతాన్ని కూడా అధికారులు, నేతలు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై, మార్పులు, చేర్పుల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. బుధవారం సందర్శించిన ప్రాంతాలతో పాటు, ప్రజల నుంచి విజ్ఞప్తులు అందిన మరికొన్ని ఆర్వోబీ ప్రతిపాదిత ప్రాంతాలను కూడా మరో రోజు సందర్శించి సాధ్యమైనంత సానుకూలంగా, ప్రజల కోరిక మేరకు మార్పులు చేస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. సమీక్ష జరుగుతున్న సమయంలో ఢిల్లీలో ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులతో, ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వట్లూరు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) కోసం కేంద్రంలో రైల్వే మంత్రి, అధికారులతో మాట్లాడుతున్నానని, త్వరలో వట్లూరు RUB కి కూడా అనుమతులు రానున్నాయని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారని. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చెప్పారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవ తీసుకుని అనుమతులు తీసుకువచ్చిన ఆర్వోబీలు అన్నింటినీ వీలైనంత త్వరగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఎమ్మెల్యే ధర్మరాజు.
ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన స్థానిక ప్రజలు పలువురు మాట్లాడుతూ.. ఆర్వోబీలకు కేంద్రం నుంచీ అనుమతులు తేవడమే కాకుండా, స్థానిక సమస్యలను కూడా పరిష్కరించేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీసుకుంటున్న చొరవ పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజుతో పాటు, NHAI, రైల్వే, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.