🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :
జిల్లా కలెక్టరేటు గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం కొల్లేరు ప్రాంతం అభివృద్ధి, ప్రజలు సమస్యలు పరిష్కారంపై జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, అటవీ, పర్యావరణం శాఖల ప్రత్యేక కార్యదర్శి శరవణనన్, ఏపి ఆప్కాబ్, ఉమ్మడి జిల్లాల డిసిసిబి చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కైకలూరు ఎమ్మెల్యేలు డా.కామినేని శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్లధర్మరాజు, సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా 2:40 గంటలు పాటు కొల్లేరు ప్రాంత మండలాలు వారీగా రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ... ఏలూరు జిల్లాలో ఏలూరు అర్బన్, ఏలూరు రూరల్, భీమడోలు, దెందులూరు, పెదపాడు, నిడమర్రు, ఉంగుటూరు, కైకలూరు, మండవల్లి, పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మండలం కలిపి మొత్తం ఉమ్మడి జిల్లాలో పది మండలాలు కొల్లేరు ప్రాంతం ఉందని వివరించారు.
ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, తీసుకున్న చర్యలు, కొల్లేరు విస్తీర్ణం మ్యాపు ద్వారా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, అటవీ, పర్యావరణం శాఖల ప్రత్యేక కార్యదర్శి శరవణనన్ కు వివరించారు. గత వరదల సమయంలో బుడమేరు నుండి ఎక్కువ వరదనీరు కొల్లేరుకు చేరినా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి కొల్లేరు ప్రాంతంలో ఒక గ్రామాన్ని కూడా ముప్పుబారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు.
రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే మాట్లాడుతూ… కొల్లేరు ప్రాంత మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.*ఏపి అప్కాబ్, ఉమ్మడి జిల్లాల చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ..* ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పైగా అవుతుందని, కొల్లేరు ప్రాంత సమస్యలు తీరి అభివృద్ధికోసం కొల్లేరు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. జిల్లాలో కొల్లేరు, అటవీ భూములు సరిహద్దులకు సంబందించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు, అటవీ, ఇరిగేషన్, రెవిన్యూ ,తదితర శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి కొల్లేరు సమస్యను పరిష్కరించాలన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ… మాకు, అటవీశాఖ అధికార్లకు సమన్వయం కొరవడిందని, కనీసం మాకు సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. కోమటిలంకకు చాలా సమస్యలు ఉన్నాయని, బ్రిడ్జి నిర్మాణంకు ఇంకా అనుమతులు రాలేదని చెప్పారు. కొల్లేరు సమస్యలు పోరాటం చేస్తే గత ప్రభుత్వం నామీద క్రిమినల్ కేసులు పెట్టారని, నాతో పాటు 35 మంది కోర్టులు చుట్టూ తిరుగుతున్నామని అన్నారు.
కొల్లేరు ఆపరేషన్ లో 14 వేల ఏకరాలు భూములకు సంబంధించి నష్టపరిహారం అందించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ రైతులు, భూ యజమానులు ఆర్థిక పరిస్థితులను, వారి పిల్లలు భవిషత్తును దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలన్నారు. కొల్లేరు సమస్యలు పరిష్కారం చూపాలని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పైగా అవుతుందని కొల్లేరు ప్రాంతం ప్రజలు చిరకాల సమస్యలు పెద్ద మనసుతో స్వీకరించి పరిష్కారం చేయాలన్నారు.
కైకలూరు శాసనసభ్యులు డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ… కొల్లేరు ప్రాంత అభివృద్ధి చాలామటుకు చేసుకోగలిగామని, మిగిలిన పనులు కూడా పూర్తయ్యేలా చూడాలని కోరారు. బుడమనేరు వరదతో కొల్లేరు ప్రాంతం ఒక గ్రామాన్ని కూడా ముప్పు బారిన పడకుండా జిల్లా యంత్రాంగం సహకారంతో చూడగలిగామన్నారు.
అటవీశాఖ అనుమతులు త్వరగా రావటం లేదన్నది నిజం అని, అటవీ శాఖ అధికారులు నిబంధనలను గౌరవించవలసిన అవసరం ఉందని కొల్లేరు ప్రజలు అభివృద్ధికి మానవతా దృక్పథంతో అభివృద్ధికి సహకరించాలన్నారు. కొల్లేరు ప్రజలు సమస్యలు ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటే కొల్లేరు ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు.
ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ.. మా నియోజక వర్గంలో ప్రభుత్వ భూముల్లో ఆక్వా చెరువులు లేవని, అంతా క్లియరుగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో కొల్లేరు ప్రాంత అభివృద్ధికి కొల్లేరు ప్రజలు ఎదురుచూస్తున్నారని, కోర్టు అనుమతులు అనుకూలంగా వచ్చేలా చూసి కొల్లేరు రక్షణకు, అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, ఆయా మండలాలు తహశీదార్లు , పారెస్టురేంజి అధికారులు పి.మోహిని విజయలక్ష్మి, కె.వి.రామ లింగాఆచార్యులు, డిప్యూటీ తహశీదార్లు, సర్వే అధికార్లు, రెవిన్యూ, అటవీశాఖ సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.