🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహాపురుషులవుతారన్న మాటలకు వాల్మీకి మహర్షి జీవితం ఒక ప్రత్యక్ష నిదర్శనం అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. వాల్మీకి జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు
ఏలూరు ఎంపీ. రామాయణ మహా కావ్యాన్ని రచించిన వ్యక్తిగా ప్రతి హిందువు పూజించాల్సిన మహా ఋషి వాల్మీకి అని, అయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. వేట వృత్తిగా అడవుల్లో బోయవాడిగా జీవిస్తున్న సమయంలో.. ఒక ప్రాణం తీయడం ఎంత తప్పో తెలుసుకుని ఘోర తపస్సు చేసి, ఋషిగా మారిపోయిన వాల్మీకి చరిత్ర అందరూ తెలుసుకోవాలన్నారు.
మహర్షిగా మారిన తర్వాత 23 వేల శ్లోకాలు, 4 లక్షల ఎనభైవేల పదాలతో రామాయణ మహా కావ్యాన్ని రచించి, కోట్లాదిమంది భారతీయులకు ఇదిగో, ఇదీ రాముడంటే, ఇదీ రాముని చరిత్ర అని తెలియచేసిన గొప్ప మనిషి వాల్మీకి. ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువలను మనకు నేర్పే ఒక అద్భుత పాఠం రామాయణం. అటువంటి మహా గ్రంథాన్ని కోట్లాది హిందువులకు కానుకగా ఇచ్చిన ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి, నిర్వహిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బోయ, వాల్మీకి కులస్థుల విజ్ఞప్తి మేరకు యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చిన విషయం, అందుకు అనుగుణంగా గత ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఉదయం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.