The Desk…Eluru : ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆదాయం తగ్గితే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వారిని ఆదుకునేందుకు తీసుకువచ్చినదే “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఆటో డ్రైవర్లకు 15 వేలు ఆర్ధిక సాయం అందించే పథకం ప్రారంభం సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇది దసరా పండగ సమయం అని, కొద్ది రోజుల్లో దీపావళి  పండుగ కూడా రాబోతోందని, ఈ పండుగల సమయంలో ఆటో డ్రైవర్ల, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాల్లో సంతోషం నింపేందుకు 15 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అక్టోబర్ 4 నుంచీ  “ఆటో డ్రైవర్ సేవలో” పథకం ప్రారంభించిందన్నారు ఎంపీ.

గతంలో వైసిపి ప్రభుత్వం “వాహన మిత్ర” పథకం పేరుతో పదివేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చేదనీ, అదే సమయంలో జరిమానాల పేరుతో అంతకు రెట్టింపు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేసేదన్నారు. కానీ ఇప్పుడు అలాంటి వేధింపులు ఏమి లేవని చెప్పారు. ఏ రోజు ఆటో నడపకపోయినా ఆ రోజు ఇంట్లో పూట గడవని పరిస్థితుల్లో నిరంతరం కష్టపడుతూ బతికే వృత్తి ఆటో డ్రైవింగ్ అని, ఆటో డ్రైవర్లలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలవారే ఉంటున్నారని, వీరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందించే 15 వేల ఆర్ధిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

ఇటీవల కూటమి ప్రభుత్వం “శ్రీ శక్తి”  పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఆటోలో వెళ్ళే ప్రయాణికుల సంఖ్య  కొంత తగ్గితే ఆటో డ్రైవర్లకి  నష్టం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో, వీరిని కూడా ఆదుకోవాలని భావించిన మన గౌ. ముఖ్యమంత్రి గారు  ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 15 వేల రూపాయలు చొప్పున సాయం అందిస్తానని హామీ ఇచ్చారన్నారు.

హమీ ఇచ్చినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు  సాయం అందిస్తున్నారని, ఇందులో మన ఏలూరు జిల్లా నుంచి 10,655 మందికి లబ్ధి పొందుతున్నారని, వీరిలో 9,193 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలవారే ఉన్నారన్నారు. ఈ సాయానికి గాను గౌ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏలూరు జిల్లా ఆటో డ్రైవర్ల తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.

ఆటో డ్రైవింగ్ లో ఉండే సోదరులు ఈ డబ్బులను ఆటో నిర్వహణ, మరమ్మతులు, కుటుంబ అవసరాలు దేనికైనా వాడుకోవచ్చునని చెబుతూ, ఈ పండుగల సమయంలో ఆటో సోదరులంతా తమ కుటుంబ సభ్యులతో,  బంధుమిత్రులతో ఈ సంతోషాన్ని పంచుకుంటూ, కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుకుంటున్నానన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.‎‎