🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, జిల్లా అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

CMRF చెక్కుల పంపిణీ: 37 మందికి 17.5 లక్షలు విలువైన CMRF చెక్కులను అందించిన ఎంపీ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాదంపూడి ఎస్సీ కాలనీ గ్రామస్థులు ఎంపీను కలిసి ప్రతిపాదిత రైల్వే గేట్ ROB వల్ల పేదల ఇళ్ళు కోల్పోతున్న పరిస్థితిని ఎంపీ కి వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ రైల్వే అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో MP మాట్లాడుతూ.. జీలుగుమిల్లి వద్ద నేవీ ఆయుధాగారం ఏర్పాటు జిల్లాకు వరం వంటిదని, ఈ ప్రాజెక్టు వల్ల పోలవరం నియోజకవర్గంతో పాటు ఏలూరు జిల్లాకు కూడా పేరు వస్తుందన్నారు. దేశంలో ఎన్నో ఆయుధ డిపోలు ఉన్నాయి, భద్రతాపరంగా ఎటువంటి ముప్పులేదు,
కేవలం 1166 ఎకరాల్లోనే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు, భూమి కోల్పోయే రైతులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లిస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే వెనుకబడ్డ పోలవరం ప్రాంతం కూడా పట్టణాలతో సమంగా అభివృద్ధి చెందాలని, అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభించాలనే ఉద్దేశంతోనే జీలుగుమిల్లి ప్రాంతంలో ఈ డిపో పెట్టాలని నిర్ణయించామన్నారు.

అపోహలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరూ అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని, గిరిజనులకు కూడా విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు లభించాలనేదే మా ధ్యేయం అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పుడు రాష్ట్రమంతా చర్చించే పరిస్థితి వచ్చిందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం రాష్ట్ర సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తోందన్నారు.
ఢిల్లీ లో కేంద్ర మంత్రులతో మాట్లాడి పొగాకు, పామాయిల్ రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించేట్ల చేయడంతో రైతులు కూడా సంతోషంగా ఉన్నారని ఎంపీ చెప్పారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో 13 ఆర్వోబీలకు అనుమతులు వచ్చాయి. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. రైల్వే గేట్ల వద్ద ప్రజల కష్టాలకు తెరపడనుందన్నారు. ఈ వర్షాకాలం తర్వాత రోడ్ల పనులపై దృష్టిసారిస్తామన్నారు.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్ట్ పనులు లేటు అవ్వటంతోపాటు, ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా 2027 కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు