The Desk…Eluru : ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని, ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని, ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ఓటు వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక కోసం ఇతర టిడిపి ఎంపీలతో కలిసి ఉదయం 9.30లకు పార్లమెంట్ కి చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంటు భవనంలోని ఎఫ్- 101 వసుధ హాల్ లో జరుగుతున్న పోలింగ్ లో పాల్గొని ఓటు వేసారు. 

అంతకు ముందు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు. ఆనంతరం తమకు కేటాయించిన సీరియల్ నంబర్ల  ప్రకారం వివిధ పార్టీల ఎంపీలు వరుసగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆరు గంటలకు ఓట్ల కౌంటింగ్ చేపడతారు. పార్లమెంట్లో ఇప్పుడున్న బలాబలాల  ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు సునాయాసమేనని భావిస్తున్నారు.‎ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్టీలకు విప్ వర్తించదు.

రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికలో ఏ పార్టీ ఎంపీ అయినా తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసుకోవచ్చు. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు జరుగుతోంది. ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు ఇచ్చారు. ‎మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా 1 అంకె, రెండో ప్రాధాన్యతా ఓటు వేయాలనుకున్న అభ్యర్ధి పేరుకు ఎదురుగా 2 అంకె వేస్తారు.

ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇద్దరికీ సమానంగా వస్తే, రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.‎‎ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సోమవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్  ఎంపీలతో సమావేశమయ్యారు.

ఎన్నికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీలకు నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఘనవిజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‎‎