🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :
జిల్లాలో ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలనీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం కన్నా అధికంగా ఈ సంవత్సరం జిల్లాకు యూరియా, డిఏ పి, తదితర ఎరువులను జిల్లాకు అధికంగా అందించామన్నారు. ప్రస్తుత సీజన్లో 33 వేల 762 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం కాగా, ఇప్పటికే 30 వేల 557 టన్నులను అందించామని, మరో రెండు రోజుల్లో మరో 2200 మెట్రిక్ టన్నులు అందుబాటులోనికి రానున్నదన్నారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అయినప్పటికీ కొంతమంది రైతులు ముందుజాగ్రత్తగా ఎరువులను అదనంగా కొనుగోలు చేయడంతో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని, అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువులను అందుబాటులో ఉంటున్నామన్నారు.
జిల్లా నుండి ఎరువులు తరలిపోకుండా 29 చెక్ పోస్టులలో నిఘా పెట్టడం జరిగిందని, నిఘాను మరింత పెంచాలన్నారు. జిల్లా నుండి ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చూడాలని, అక్రమంగా తరలించేవారిపై, ఎరువులను బ్లాక్ మార్కెటింగ్, దారిమళ్లించే వారిపై, అధిక ధరలకు అమ్మడం, అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు కాకుండా పీడీ ఆక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు.
ఎరువుల కొరత ఏర్పడిందనే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ఆయిల్ పామ్ లో యూరియా వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతు శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, అన్ని విషయాలలోనూ ప్రతీ రైతుకు అండగా నిలుస్తుందన్నారు. సాగులో యాంత్రీకరణను పెంచడం ద్వారా సాగు ఖర్చును తగ్గించి, రైతాంగానికి అధిక దిగుబడి, ఆదాయం పొందేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులకు గత ప్రభుత్వం బకాయిలు పడిన 1674 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం చేపట్టిన నెలరోజులలోనే పూర్తిగా చెల్లించిందని, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందనడానికి నిదర్శనమన్నారు. జిల్లాలో రైతులకు 530 పంపిణీ కేంద్రాల ద్వారా ఎరువులను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, రైతులలో భరోసా నింపేందుకు అన్ని నియోజకవర్గాలలోనూ మండల స్థాయిలో ఎరువుల పంపిణీ ప్రణాళిక, కొరత లేదన్న విషయాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఎరువుల పంపిణీలో రైతుల సమస్యలను తెలియజేసేందుకు సంబంధిత అధికారుల ఫోన్ నంబర్ల వివరాలను జిల్లాలోని అన్ని సొసైటీలు, ఎరువుల డీలర్లు, డిసిఎంఎస్ కేంద్రాలు, రైతు సేవ కేంద్రాల వద్ద ప్రదర్శించాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతీరోజు జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తున్నారని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారన్నారు.
ఖరీఫ్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం : ఖరీఫ్ సీజన్లో గతంలో కన్నా అధికంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటలలోగా రైతుల ఖాతాలలోకి సొమ్ము జమ చేస్తామన్నారు. కాల్ సెంటర్ కు వచ్చే రైతుల సమస్యలపై 24 గంటలలోగా పరిష్కరించాలన్నారు. ఎరువుల పంపిణీలో ఆన్లైన్లో సర్వర్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ.. జిల్లాలో గత సంవత్సర కన్నా అధికంగా ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఎరువులను రైతులకు అందించారన్నారు. సూపర్ సిక్స్ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని , ఇది భరించలేని కొందరు లేని కొరతను సృష్టించి రైతులను రెచ్చగొడుతున్నారని, వాటిని తిప్పికొట్టాలన్నారు.

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ… జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలతో రైతులకు ఎరువులను సక్రమంగా పంపిణీ జరిగిందన్నారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో గోడౌన్లను స్టాక్ పాయింట్ లుగా ఉపయోగించుకుని గ్రామ స్థాయిలో ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలన్నారు. “రైతులెవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రైతులు అందరికీ యూరియాను అందచేస్తున్నామన్నారు. కొన్ని మీడియా కథనాల్లో యూరియా కొరత అంటూ వస్తున్న వార్తలతో అభద్రతకు గురై రైతులు ఆందోళన చెందడం వల్ల యూరియా కృత్రిమ కొరత ఏర్పడుతుందని, అయితే అదనంగా యూరియా తీసుకున్న రైతులకు సుదీర్ఘ కాలం నిల్వ చేసుకునే అవకాశం కూడా వారికి ఉండదన్నారు. సొసైటీలకు అందించే యూరియా స్టాకులు ఒకేసారి అవసరమైన మేర అందించటం, అదే విధంగా యూరియా స్టాక్ వచ్చిన వెంటనే రైతులకు అందించేలా ఈ-పాస్ సాంకేతిక సమస్యలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ… చింతలపూడి నియోజకవర్గంలోని రైతులకు ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగిందని, జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని, రైతుల అవసరాలకు తగినవిధంగా ఎరువులు అందించారన్నారు.

పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ… తమ నియోజకవర్గంలో ఎరువుల కొరత లేదన్నారు. ప్రస్తుతం 229 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయని, సెప్టెంబర్ నెలకు మరో 200 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో 10 వేల ఎకరాలలో ప్రత్తి, మిర్చి పంటలు వేస్తున్నారని, వాటికి యూరియా సరఫరా చేయాలనీ కోరారు.
డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. తమ 21 బ్రాంచీలలో 396 టన్నుల ఎరువుల నిల్వలు ఉంచి, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేస్తున్నామన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవనాలాధికారి రామ్మోహన్, జిల్లా సహకారాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, మార్కెఫెడ్ అధికారి సిహెచ్. ప్రసాద్ గుప్త, జిల్లాలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, పలువురు రైతులు పాల్గొన్నారు.