The Desk…Eluru : జీఎస్టీ తగ్గింపుతో రైతాంగానికి ప్రయోజనం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : జీఎస్టీ తగ్గింపుతో రైతాంగానికి ప్రయోజనం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

  • జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం.

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

జీఎస్టీ శ్లాబుల్లో కేంద్రం తీసుకొచ్చిన మార్పుల పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల విధానాన్ని రెండు శ్లాబులకు తీసుకురావడంతో పాటు, బీడీ ఆకులపై, పలు వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించారు. ట్రాక్టర్లు, ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు,  స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, స్ప్రింక్లర్లు సహా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించడంతో రైతన్నకి లబ్ధి కలుగుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. వ్యవసాయ పనిముట్ల, యంత్రాల, కొన్ని రకాల పురుగుమందుల ధరలు తగ్గి రైతాంగానికి మేలు చేకూరుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు.‎‎

రైతన్నపై భారం తగ్గించేందుకు ఏలూరు ఎంపీ కృషి.. ‎వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగు ఖర్చు పెరిగిపోవటం, పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ ధరలు, కోకో రైతుల సమస్యలపై అనేకమార్లు తాను కేంద్ర వ్యవసాయ, వాణిజ్య శాఖల మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.‎

తమ విజ్ఞప్తులను పరిశీలించి ముఖ్యంగా బయో పెస్టిసైడ్స్, వ్యవసాయ పరికరాలు వంటివాటిపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చుతూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి, జీఎస్టీ కౌన్సిల్ కి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఏలూరు రైతాంగం తరపున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నిర్ణయాల వల్ల ముఖ్యంగా డ్రిప్ పరికరాల ధరలు తగ్గి ఏలూరు జిల్లాలో పొగాకు, కోకో, పామాయిల్ ఎక్కువగా సాగు చేస్తున్న రైతులకు మేలు జరుగుతుందని, అదేవిధంగా పురుగుమందులు, వ్యవసాయ పరికరాల ధరలు తగ్గి, ఆ మేరకు రైతాంగంపై భారం తగ్గుతుందని ఎంపీ వెల్లడించారు. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా రైతాంగానికి మేలు జరిగేలా తనవంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ‎

‎రైతు ప్రతినిధుల హర్షం.. పురుగుమందులు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించడం పట్ల పలువురు రైతు సంఘాల నాయకులు, రైతు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆలాగే రైతులు, కార్మిక సంఘాల నేతలు ఎంతోకాలంగా కోరుతున్నట్లుగా బీడీ ఆకులపై జీఎస్టీ 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం పట్ల కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు.

జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి తమ కష్ట నష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.‎‎