The Desk … Eluru: ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం

The Desk … Eluru: ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK:

విద్యార్ధులను సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ధాలి…

ఉపాధ్యాయులు జీవనదిలాంటి వారు…

విద్యారంగంలో జిల్లా రోల్ మోడల్ గా నిలవాలి…

ఉపాధ్యాయ రంగం వృత్తికాదు…బాధ్యత…

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి…

విద్యార్దులకు అక్షర జ్ఞానం అందించడంతో పాటు వారిని సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే గురుతరమైన భాధ్యత ఉపాధ్యాయులపై వుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. గురువారం స్థానిక జెడ్పి సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఇఓ ఎస్. అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. స్వాగత నృత్యం, మా తెలుగుతల్లికి మల్లెపూలదండ ప్రార్ధనాగీతంతో జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాలంకరణ గావించి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ.. మంచి విజ్జానం అందించే భోధనతో పాటు విద్యార్ధులను సామాజిక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ధాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ రంగం వృత్తిగా భావించకుండా సామాజిక బాధ్యతగా గుర్తెరగాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తాను విద్యార్ధిదశలో చోటు చేసుకున్న పలు సంఘటనలను సభలో పేర్కొంటూ తాను ఈ రోజు ఈస్ధాయికి చేరుకోవడంలో తోడ్పడిన తమ తల్లిదండ్రులను తొలి గురువులుగా పేర్కొంటూ పాఠశాల,జూనియర్ కళాశాల , ఐఐటి ల్లల్లో తనకు విజ్ఞానం, మనోధైర్యాన్ని అందించడంలో పాటుబడిన ప్రతి ఉపాధ్యాయులు,ప్రొఫెసర్లకు ఎంతో రుణపడివున్నని వారందరికీ ధన్యవాదాలు తెలుకుంటూ సాష్టాంగ నమస్కారం తెలియజేస్తున్నాని తెలిపారు. ప్రతి పాఠశాలలో తమ ప్రతిభ పాటవలతో కొందరు ఉపాధ్యాయులు విద్యార్ధులకు చిరకాలం గుర్తుండిపోతారని పేర్కొంటూ పాఠశాల, కళాశాల, ఐఐటి లలో విధ్యను అభ్యసంచే సమయంలో గురువు అందించిన జ్ఞానంతోపాటు, బాధ్యతలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. తాను విద్యనభ్యసించిన జూనియర్ కళాశాలలో సైన్సు ల్యాబ్ కు తనపేరు పెట్టి ఫొటోపెట్టడం జరిగిందని. అదిచూసి ఉపాధ్యాయులను తన పేరు ఎందుకూ పెట్టారని అడుగగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి ఐఎఎస్ సాధించిన మీస్పూర్తిని కళాశాలలో ఇతర విద్యార్ధులు కూడా ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఉన్నత శిఖరాలు సాధించడానికి ప్రేరణ కలుగుతుందనే ఉద్ధేశ్యంతో ఏర్పాటు చేసినట్లు వారు తెలపడం ఎంతో ఆనందనిస్తుందన్నారు. తమ తండ్రి చిన్నతనం నుండి ఎన్నో పుస్తకాలను తెచ్చి తమలో పుస్తక పఠనం ఆసక్తి కలిగించారని, త ద్వారా విద్యాజ్ఞానాన్ని సాధించగలిగానని అన్నారు. కోవిడ్ సమయంలో రెండు నెలలుపాటు ఎస్ఇఇ ఆర్డి సిలబస్ పుస్తకాలు రూపొందించడంలో ఎందరో ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయడం ఇప్పటికీ మరువలేనిదని కలెక్టర్ పేర్కొన్నారు. వారి విధి నిర్వహణ ఎంతో స్పూర్తిదాయకమన్నారు. జిల్లాను విద్యారంగంలో రోల్ మోడల్ గా సాధించడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ గురుపూజోత్సవ సందర్బంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్ధుల్లో ఇమిడివుండే ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. సమాజానికి గురువే ప్రధమమని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంటామని సమాజం అభివృద్ధిలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులే ప్రధమ గురువని ఆయన పేర్కొన్నారు. రేపటి సమాజం మార్పులకోసం ఉపాధ్యాయులు విద్యార్ధులకు భోధించే విధ్యాబోధనలో, క్రమ శిక్షణలోను గురువులు బాధ్యత తీసుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో విలువైనదని విద్యార్ధుల భవిష్యత్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. చదువులపై విద్యార్ధులకు ఆసక్తిని పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. నేటి సమాజంలో విద్యార్ధులు సెల్ ఫోన్స్ వినియోగం ఎక్కువగా చేస్తున్నారని దానివల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందని ఈ విషయంలో తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా విద్యార్ధులకు సెల్ ఫోన్ వినియోగంవల్ల మంచి చెడులను వివరించాలని ఆమె కోరారు. విద్యార్థినులకు బాడ్ టచ్ గుడ్ టచ్ల పై అవగాహన కల్పించాలన్నారు.దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతివ్యక్తి జీవితంలో గురువు, తల్లిదండ్రుల పాత్ర ఉంటుందని అన్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంతగొప్పస్ధానం గురువుకే దక్కుతుందని అన్నారు. విద్యార్ధులకు విద్యాబోధనలు నేర్పించి వారి భవిష్యత్ ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ మంచి విద్యనందించడం అత్యున్నత మార్గం అని అలాంటి విద్యనందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవంగా సత్కరించే కార్యక్రమంలో ఆనందంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. తాను కూడా ముందుగా మండల ప్రజా పరిషత్ స్కూల్ నందు అలాగే జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో, నవోదయ స్కూల్లో విద్యాభ్యాసం చేశానన్నారు.ఉపాధ్యాయలు చేసేది ఉద్యోగం కాదని సమాజంలో ఉపయోగపడే వ్యక్తులను తయారు చేసే వారే ఉపాధ్యాయులన్నారు, తాము చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధత తో చదువును నేర్పించే వారని, అన్ని విషయాలలో ప్రాముఖ్యతను ఇస్తూ విద్యార్థిని విద్యార్థులకు కావలసిన సిలబస్ ను ఉపాధ్యాయుల యొక్క సొంత డబ్బులతో గైడ్ల కొనుగోలు చేసి విద్యార్థులకు అందచేసి విద్యలో ముందుంజ వేసే విధముగా తీర్చిదిద్దారన్నారు.విద్యార్థి దశలో విద్యార్థిని విద్యార్థులు మంచి స్టూడెంట్స్ చెడ్డ స్టూడెంట్స్ అని ఉండరని , అది స్కూల్లో చదువును నేర్పే ఉపాధ్యాయులు చెప్పే సామాజిక విలువలను వలన సమాజంలో ఉన్నతమైనటు వంటి పదవులు గాని రాజకీయవేత్తలు గాని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను తయారు చేసే వారి ఉపాధ్యాయులని తెలియచేస్తూ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను తయారు చేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారని, వీరు అందించే విద్యాబోధనలు ద్వారా శాస్త్రవేత్తలు, రాజకీయ వేత్తలు, తదితర గొప్ప వ్యక్తులుగా తయారుచేసి ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో బాగస్వాములు చేయాలని దీనికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని అన్నారు. ఉపాధ్యాయవృత్తికాదని బాధ్యత అని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలేనిదే మరేఇతరవృత్తి ఉండదని అంతటి గొప్పవృత్తిలో ఉన్న ఉపాధ్యాయులందరికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, డిఇఓ ఎస్. అబ్రహాం తదితరులు ప్రసంగించారు.

31 మందికి పురస్కారాలు…

గురుపూజోత్సవ సందర్బంగా జిల్లాలో 31 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చేతులమీదుగా అవార్డులు అందించి సన్మానించారు. ఈ అవార్డులలో గ్రేడ్-2 హెడ్మాస్టార్స్, స్కూల్ అసిస్టెంట్సు, ఎస్ జిటిలు, ఎస్ఎస్ సి 2023-24, అత్యధిక శాతం పాసయ్యిన స్కూల్ ప్రిన్సిపాల్స్ కి,అత్యధిక ఎన్వరోలమెంట్ హెచ్ఎం లకి ఉపాధ్యాయ వృత్తిలో ఒక్కరోజుకూడా సెలవు వినియోగించుకోకుండా పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయునికి, జాతీయ స్ధాయిలో లెవిల్ విన్నర్ గా పాల్గొన్న స్కూల్ మాస్టర్ కి అవార్డులను అందించడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ సిఇఓ నిర్మలాజ్యోతి, యంఇవోలు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.