The Desk…Eluru : పోలవరం నిర్వాసితులకు ఉపశమనం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : పోలవరం నిర్వాసితులకు ఉపశమనం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

🔴 ఏలూరు జిల్లా :ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని జాబ్ కార్డుల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు

ప్రారంభించారు.పోలవరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఇటీవల జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వద్ద పలువురు నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

పాత గ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు బదిలీ జరగకపోవడంతో పనులు దొరకక తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు.తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ జిల్లా పరిషత్ సీఈవోతో పాటు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్వాసితులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే జాబ్ కార్డులు మంజూరు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సీఈవో సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చి ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.

ఈ ప్రక్రియ ద్వారా నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.పాత గ్రామంలో జాబ్ కార్డు ఉన్నవారు, కొత్త ప్రదేశంలో లేక ఇబ్బందులు పడుతున్నవారు తమ ప్రాంత ఎంపీడీవోను వెంటనే సంప్రదించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో నిర్వాసితులకు సూచించారు. పాత గ్రామం, ప్రస్తుత నివాస ప్రదేశ వివరాలు, ఆధార్ కార్డు లేదా సంబంధిత ఆధార పత్రాలు 15 రోజుల వ్యవధిలో సమర్పించాలని, పూర్తి సమాచారం అందిస్తే అధికారులు పరిశీలించి, జాబ్ కార్డు ఇప్పుడు ఉన్న ప్రదేశానికి బదిలీ చేస్తారని ఎంపీ తెలిపారు.

ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవలసిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. పోలవరం నిర్వాసితులు ఇకపై ఉపాధి అవకాశాల విషయంలో ఇబ్బందులు పడకూడదని, ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫలాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరేలా తన వంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రజలు ఏదైనా సమస్య వచ్చినపుడు ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయ నంబర్స్ +91 96181 94377, +91 98855 19299 కు ఎవరైనా కాల్ చేయవచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.