The Desk…Eluru : జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

The Desk…Eluru : జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
  • జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో టోల్ ఫ్రీ నంబర్స్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • ఏలూరు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077 మరియు 9491041419 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్ ఏలూరు: 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్: 9491030712

అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలీకాన్ఫెరెన్స్

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం పరిస్థితిని అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏలూరుతో పాటు డివిజనల్ స్థాయిలో 24 గంటలపాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబర్ తో మరియు 9491041419 తో ఏర్పాటుచేయడం జరిగిందని, ఈ కంట్రోల్ రూమ్ లో విద్యుత్, వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న 108 వాహనాల జాబితా, డ్రైవర్ల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓ ని కలెక్టర్ ఆదేశించారు.

పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఈ దృష్ట్యా ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటి నుంచే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవిన్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలం ప్రధాన కేంద్రంలో, డివిజన్ ప్రధాన కేంద్రాలలో రెవెన్యూ సిబ్బంది 24×7 అందుబాటులో ఉండాలని తెలిపారు, పకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తుగానే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. తమ్మిలేరు, బుడమేరు, ఏలూరు కాలువ ఉధృతంగా ప్రమాద పరిస్థితిలో ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా, ఆకస్మిక వరదల సమాచారాన్ని కింద ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. కొల్లేరులోని ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు తగిన విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం గిరిజన ప్రాంతాలలో కొండవాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ ప్రాంతాలలో ప్రజలు దాటకుండా అధికారులు సిబ్బందితో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి, గట్టి నిఘా పెట్టాలన్నారు. బలహీనంగా ఉన్న నదులు, చెరువులు, కాల్వ గట్లను పరిశీలించి వాటిని ఇసుక బస్తాలతో పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులలో స్నానాలు, చేపల వేటకు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి, గట్టి నిఘా పెట్టాలన్నారు.

శనివారం నుండి ఉప్పుటేరు పై ఆక్రమణలు తొలగించేందుకు ఇరిగేషన్, రెవిన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యాన, తదితర పంటల ప్లాంటేషన్లు జరగకుండా రైతులకు అవగాహనపరచాలన్నారు. వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలన్నారు.