The Desk…Eluru : “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)” కార్యక్రమానికి ప్రోత్సాహం.‎‎..

The Desk…Eluru : “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)” కార్యక్రమానికి ప్రోత్సాహం.‎‎..

  • వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ” ఉత్పత్తులకు కేంద్ర, రాష్ట్రాల ప్రోత్సాహం.‎..
  • 1000కి పైగా ఉత్పత్తులు. అందులో ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం చీరలు‎..
  • ఏపీ లో 26 జిల్లాల్లో మొత్తం 99 ఉత్పత్తులు‎..
  • విశాఖపట్నంలో ₹172 కోట్లతో పీఎం ఏక్తా మాల్‎..
  • మార్కెటింగ్, బ్రాండింగ్ లలో యువత, మహిళలకు ఉచిత శిక్షణ..

🔴 దిల్లీ/ఏలూరు : ది డెస్క్ :‎

“వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)” ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.ODOP ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు “డిజిటల్ ODOP గిఫ్ట్ క్యాటలాగ్” ప్రవేశపెట్టామని, ఇందులో 1000కి పైగా ఉత్పత్తులు లభిస్తాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం చీరలు వంటివి ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు PM Ekta Malls పేరుతో నిర్మాణాలు చేపట్టామని, ఇందులో భాగంగా విశాఖపట్నంలో 5 ఎకరాల్లో పీఎం ఏక్తా మాల్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹172 కోట్లతో సమర్పించిన డీపీఆర్ ను DPIIT ఆమోదించిందని, నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని, ఈ ప్రాజెక్ట్ మే 2026 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు.

‎‎ODOP ఉత్పత్తుల ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొత్తం 99 ఉత్పత్తులను (23 ప్రాథమిక, 19 ద్వితీయ, 13 తృతీయ, 18 ఇతర వర్గాలు) గుర్తించడం జరిగిందని, ఇందులో వ్యవసాయరంగం నుంచి 7, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి 5, హస్తకళలకు సంబంధించి 29, చేనేత నుంచి 32, తయారీ రంగం నుంచి 6, సముద్ర ఆధారిత ఉత్పత్తులు 3, ఇతర రంగాల నుంచి మరో మూడు ఉత్పత్తులను గుర్తించడం జరిగింది.

ఈ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం DPIIT నుంచి ప్రత్యేక  సాయం అందించే ఏర్పాటు ఏదీ లేదని, రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన సౌకర్య కేంద్రాలు, పరీక్షా ప్రయోగశాలలు, ప్యాకేజింగ్ యూనిట్లు, డిజైన్ కేంద్రాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. ODOP ఉత్పత్తుల విక్రయాల పెంపు కోసం ప్రభుత్వ కార్యాలయాలు, MSMEలు, వ్యాపారవేత్తలకు (ప్రత్యేకించి యువత, మహిళలకు) శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సామర్థ్యాభివృద్ధి శిబిరాలు నిర్వహించారు.

వీటిలో మార్కెటింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇవ్వబడుతోంది. ఈ చర్యలతో విక్రయాలు పెరుగుతున్నాయని, ఈ ఉత్పత్తులు లేపాక్షి, ఆప్కో లకు చెందిన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలో కూడా అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రసాద తెలిపారు.‎