- ప్రధానితో భేటీలో పామాయిల్ రైతుల సమస్యల ప్రస్తావన
- కొవ్వూరు -భద్రాచలం రైల్వేలైన్ సహా పలు ఆర్వోబీలు, రోడ్లు పనుల్లో ముందడుగు
- 12 అర్వోబీ లు మంజూరు, మరో 4 ఆర్వోబీలకు విజ్ఞప్తులు
- పామాయిల్, కోకో రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి
- కేంద్ర మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న ఏలూరు ఎంపీ
ఫలిస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి
దిల్లీ/ఏలూరు : ది డెస్క్ :
ఈరోజు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతుల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కేంద్రం దృష్టికి తీసుకు వస్తున్నామని, కేంద్ర మంత్రులు, అధికారులు కూడా వీటిపై సానుకూలంగా స్పందిస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.
ఏలూరు పార్లమెంటు పరిధిలోని చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతోపాటు ఉత్తరాంధ్ర మరియు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్ శాంక్షన్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఇటీవల రైల్వే మంత్రిని కలిసినప్పుడు డీపీఆర్ తయారైందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ పుట్టా మహేష్ చెప్పారు. అదేవిధంగా 12 ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రాబోవు రెండు, మూడు నెలల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో భూసేకరణ కార్యక్రమాలు పూర్తి చేసి పనులు మొదలుపెట్టనున్నారని ఎంపీ తెలిపారు.
భూసేకరణకు అవసరమైన నిధులు విడుదలకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ 12 ఆర్వోబీలతో పాటు కైకలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మరో నాలుగు ఆర్వోబీలకు కూడా అనుమతి కోరుతూ తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి వినతిపత్రం ఇచ్చామని ఎంపీ పుట్టా మహేష్ తెలిపారు.
పొగాకు కొనుగోళ్లకు సంబంధించి సీలింగ్ పరిమితిని తొలగించి, అధికంగా పండించిన పొగాకును విక్రయించుకోవడానికి అనుమతించి, పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవశ్యకతను కూడా కేంద్ర వాణిజ్య మంత్రి దృష్టికి తీసుకురాగా వచ్చే వారంలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ చెప్పారు. అలాగే పామాయిల్ కు ఫిక్స్డ్ ధరను నిర్ణయించి ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
ఈసారి సమావేశాల్లో సాధ్యమైనంత వరకూ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోని సమస్యలను, అన్ని పెండింగ్ ప్రాజెక్టులను లోక్ సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నానని, అంతే కాకుండా నిరంతరం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి, నిధుల విడుదలకు కృషి చేస్తున్నానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియాకు తెలియచేశారు.