🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే నూతన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్కింగ్ జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్లు జారీ చేయాలని ఏపియూడబ్ల్యూజె ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కు వినతిపత్రాన్ని అందించి జర్నలిస్టుల సమస్యలను తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషిచేస్తానన్నారు. జర్నలిస్టుల డిమాండ్ లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానన్నారు. ప్రభుత్వ ఉత్రవులు వచ్చినవెంటనే నూతన అక్రిడిటేషన్లు అందిస్తాని హామీ ఇచ్చారు.
ఐజెయూ నాయకులు జివిఎస్ఎన్ రాజు, జిల్లా అధ్యక్షులు కెపికె కిషోర్ లు మాట్లాడుతూ… గత ప్రభుత్వం అమలు చేసిన నిర్బంధ నియమాలను సవరించి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేస్తామని సంకీర్ణ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, అక్రిడిటేషన్ నియమాల సవరణకు సంబంధించిన కొత్త జిఓ విడుదల కాలేదన్నారు. ఫలితంగా, గత ప్రభుత్వ అక్రిడిటేషన్లు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు.
పాత అక్రిడిటేషన్ల గడువు ఈ సంవత్సరం ఇప్పటికే మూడుసార్లు పొడిగించబడిందన్నారు. ప్రస్తుత అక్రిడిటేషన్ వ్యవధి ఆగస్టు 31తో ముగుస్తుందని, అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ మళ్ళీ వ్యవధిని పొడిగించకుండా కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అందులో పాత అక్రిడిటేషన్ వ్యవధిని ఇక పొడిగించకూడదు, రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని, రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలని, వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని ప్రయోజనకరంగా మార్చాలని, వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్ళు స్థలాలు అందించాలని, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జర్నలిస్టుల పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలనీ వారు డిమాండ్ చేసారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టైమ్స్ కిషోర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు సంజయ కుమార్, శీర శ్రీనివాస్, ఏపియూడబ్ల్యూ జె ఉపాధ్యక్షులు ఊర్ల శ్రీనివాస్, యూనియన్ నాయకులు సిహైచ్ రామకృష్ణ రాజు, షైక్ రియాజ్, విజయ్ కుమార్, శ్రీధర్, పోతురాజు, బ్రహ్మయ్య, కె.రత్న కుమారి, వాసు తదితరులు పాల్గొన్నారు.