The Desk…Eluru : బీ- రెడీ పేరుతో అంతర్జాతీయంగా కొత్త ప్రాజెక్ట్ అమలు : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : బీ- రెడీ పేరుతో అంతర్జాతీయంగా కొత్త ప్రాజెక్ట్ అమలు : ఎంపీ పుట్టా మహేష్

🔴 దిల్లీ / ఏలూరు : ది డెస్క్ :

గ్రామీణ ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందని ప్రాంతాల్లో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరియు రాష్ట్రాల వారీగా అమలు స్థితి గురించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ మంగళవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

భారత ప్రభుత్వం 2014 నుండి వ్యాపార సౌలభ్య వాతావరణాన్ని మెరుగుపరచడంలో చురుకుగా నిమగ్నమై ఉందని, ఇందుకు వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక, జన్ విశ్వాస్ చట్టం, కంప్లైయన్స్ తగ్గింపు కార్యక్రమాలు, సింగిల్ విండో సిస్టమ్‌లు, తదితర చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి వివిధ రాష్ట్రాలతో కలిసి బి.ఆర్.ఎ.పి, ఆర్.సి.బి, ఎన్.ఎస్. డబ్ల్యూ.ఎస్, వంటి సంస్కరణలతో కూడిన కార్యాచరణ చేపట్టిందని, వ్యాపార పరంగా షరతులను 45,000కి పైగా తగ్గించబడ్డాయని కేంద్ర మంత్రి తెలిపారు.

వాటిలో 15,898 సరళీకరణ, 22,264 డిజిటలైజేషన్, 4,023 డీక్రిమినలైజేషన్, 2,909 తొలగింపు చర్యలు తీసుకున్నామని, మొత్తం 30 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు సింగిల్ విండో సిస్టమ్ చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఎన్.ఎస్.డబ్ల్యూ.ఎస్ తో ఫార్వర్డ్, రివర్స్ ఇంటిగ్రేషన్ పూర్తి చేసిన మొదటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

19 మంత్రిత్వ శాఖల ఆధీనంలోని 42 చట్టాలలో 183 నిబంధనలు నేరరహితం చేయబడ్డాయని, డీక్రిమినలైజేషన్ ద్వారా వ్యాపార సౌలభ్యం పెరిగిందని, ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారతదేశం 2019 నాటికి 63వ స్థానానికి మెరుగుపడిందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.

ప్రస్తుతం బీ- రెడీ పేరుతో అంతర్జాతీయంగా కొత్త ప్రాజెక్ట్ అమలులో ఉందని, కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రధానంగా రాష్ట్రాల వారీగా పెట్టుబడుల వివరాలు నిర్వహించకపోయినప్పటికీ, గత ఐదు ఆర్థిక సంవత్సరాల విదేశీ పెట్టుబడి వివరాలను కేంద్రమంత్రి తెలియజేశారు.

గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సాధించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార సౌలభ్య కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గ్రామీణ మరియు అభివృద్ధి చెందని ప్రాంతాలకు కూడా వర్తింపజేసిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చర్యలు వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.