The Desk…Eluru : దేశవ్యాప్తంగా డార్క్ ఫైబర్‌ నుండి గత ఐదేళ్లలో 6.70 కోట్లు ఆదాయం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : దేశవ్యాప్తంగా డార్క్ ఫైబర్‌ నుండి గత ఐదేళ్లలో 6.70 కోట్లు ఆదాయం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :

భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 1,10,911 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 2899 కి.మీ డార్క్ ఫైబర్‌ను జూన్ 2025 నాటికి లీజుకు తీసుకున్నారని, ఈ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 358 కంపెనీలు, ఆంధ్రప్రదేశ్‌లోని 9 కంపెనీలకు డార్క్ ఫైబర్‌ను లీజుకు ఇచ్చామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 6.70 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుండి రూ.20.70 లక్షలు ఆదాయం సమకూరినట్లు కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డార్క్ ఫైబర్ కనెక్షన్ల మొత్తం పొడవు, గత ఐదేళ్లలో ఏపీతో సహా ఇతర రాష్ట్రాలకు డార్క్ ఫైబర్ కనెక్షన్‌లను లీజుకు ఇచ్చిన కంపెనీలు, తద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరిందని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

టెలికమ్యూనికేషన్ల శాఖ డార్క్ ఫైబర్ కనెక్టివిటీకి సంబంధించి మంజూరు చేసిన టెక్నో-వాణిజ్య అమరిక, లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లు షరతుల ప్రకారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు-I డార్క్ ఫైబర్ కనెక్టివిటీని అందిస్తున్నాయని, డార్క్ ఫైబర్ కనెక్టివిటీ వివరాలను సంబంధిత టిపిఎస్, ఐపిలు నిర్వహిస్తున్నాయని, దేశవ్యాప్తంగా గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి డిజిటల్ భారత్ నిధి ద్వారా దశల వారీగా భారత్‌నెట్ ప్రాజెక్ట్‌ను డిపార్ట్‌మెంట్ అమలు చేస్తోందదని కేంద్ర మంత్రి బదులిచ్చారు.