The Desk…Eluru : అక్రమ విదేశీ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వ చర్యలు : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : అక్రమ విదేశీ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వ చర్యలు : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను నమోదు చేస్తుందని, నిబంధనలు అతిక్రమిస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

అక్రమ విదేశీ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం భారతదేశంలో క్రిప్టోకరెన్సీలు లేదా వర్చువల్ ఆస్తులు నియంత్రణలో లేవని, ఈ కారణంగా ఏ ప్లాట్‌ఫామ్ చట్టబద్ధమో, చట్టవిరుద్ధమో అనే అంశం స్పష్టంగా నిర్ణయించబడలేదని, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదికలను గుర్తించి, చర్యలు తీసుకోవడంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి బదిలిచ్చారు.

అలాగే 2022 ఆర్థిక చట్టం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194Sని ప్రవేశపెట్టి, వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 1% పన్ను మినహాయింపు విధించడం జరిగిందని, ఇది ఆఫ్‌షోర్ ఎంటిటీలపై కూడా వర్తిస్తుందని, క్రిప్టో ఆస్తుల వినియోగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుమార్లు హెచ్చరికలు, సలహాలు జారీ చేసిందని, వినియోగదారులు, హోల్డర్లు, వ్యాపారులు ఈ క్రిప్టో కరెన్సీల వలన ఎదుర్కొనే ఆర్థిక, ఆపరేషనల్, చట్టపరమైన, భద్రతా నష్టాలపై అవగాహన కల్పించే ప్రకటనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.