🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ కార్మికులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం అని ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం ఏలూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయం 3 వ సర్కిల్ వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమావేశం జరిగింది.
సమావేశంలో పాల్గొన్న భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… మున్సిపల్ ఇంజనీరింగ్, కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నారు. పర్మినెంట్ కార్మికులకు అపరిష్కృతంగా ఉన్న ఆరు డిఏలు, సరెండర్ లీవ్, ఎన్ కాష్ మెంట్ చెల్లింపునకు తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం అన్యాయంగా మున్సిపల్ కార్మికులను అరెస్టు చేసిందని విమర్శించారు. తక్షణం తమ న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించి పరిష్కారం చేయాలని,లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాల ద్వారా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు దొడ్డిగర్ల నాగబాబు, నగర ఉపాధ్యక్షులు బంగారు దుర్గాప్రసాద రావు,యూనియన్ సభ్యులు వంశీ,సోమధుల మల్లేశ్వరరావు, దుర్గారావు,బంగారు అంకమ్మ,అర్జీ సత్యవతి,తోట శాంతి,బంగారు కుమారి,పెందుర్తి రమణమ్మ,పొట్లూరు సురేష్, మాడుగుల దుర్గ భవాని,తదితరులు పాల్గొన్నారు.

