- మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు నూతన భవన నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన
🔴 ఏలూరు జిల్లా : దెందులూరు : ది డెస్క్ :

జాతీయ రహదారుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. దెందులూరు మండలం కొత్తగూడెం శివారు సింగవరం యాదవ్ నగర్ లో ఎంపీ నిధులు రూ.25 లక్షలతో చేపడుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు నూతన భవన నిర్మాణానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఉన్న గంగాదేవి అమ్మవారి ఆలయం సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ..
ముఖ్యంగా జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అరోబీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను ఇప్పటికే పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. రూ. 1000 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టే 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిపాలన ఆమోదం తెలిపిందని ఎంపీ స్పష్టం చేశారు.
సింగవరం యాదవ్ నగర్ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆర్.యు.పీ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబడతానని ఎంపీ తెలిపారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎంపీ వివరించారు.
మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు నూతన భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కూటమి నాయకులు, యాదవ్ సంఘం ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ గారపాటి రామసీత, నాయకులు పాల్గొన్నారు.

