- టొబాకో బోర్డు పాలకవర్గం సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
గతంతో పోల్చితే రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంలో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని.. మరోవైపు రాష్ట్రంలో పొగాకు మార్కెట్‌కు దిక్సూచిగా ఉండే కర్ణాటకలో ధరలు బాగున్నా మార్కెట్ మందకొడిగా సాగుతోందని, దాదాపు 40 శాతం వరకు పొగాకు రైతుల వద్దనే ఉన్నందున త్వరగా వేలం నిర్వహించాలనే రైతుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు ఎంపీ, టొబాకో బోర్డు సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ పాలకవర్గానికి విజ్ఞప్తి చేశారు.
గుంటూరు ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన టొబాకో బోర్డు పాలకవర్గం సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. జూలై తొలి వారంలో వేలం కేంద్రాలు ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని ఎంపీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు రైతులు సాగు చేసిన పంట చివరి ఆకు వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు సూచించారు.
బోర్డు నిబంధనలు సడలించి వర్జీనియా పొగాకు పంట సాగు రిజిస్ట్రేషన్, బ్యారన్ లైసెన్సుల గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ఎంపీ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పొగాకు రైతులకు ఊరటకలిగిందని, 2025-26 పంట సీజన్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాల్లోని 83,500 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.
సమావేశంలో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ, ఎల్.ఆర్.ఎస్., డైరెక్టర్ (వేలం) శ్రీనివాసులు, మేనేజర్ (వేలం), కార్యదర్శి డి. వేణుగోపాల్, మేనేజర్ (జి.డబ్ల్యు.ఎఫ్.), మేనేజర్ (ఎంకేటీజీ మరియు ఎగుమతులు) మరియు మేనేజర్ (ట్రేడింగ్ వింగ్) బి.మారన్న, ప్రొడక్షన్ మేనేజర్ కేవీ రామాంజనేయులు, విస్తరణ మేనేజర్ జి.దామోదర్, మేనేజర్ (ఫైనాన్స్ మరియు అకౌంట్స్) ఎం.రత్నబాయమ్మ, ప్రాంతీయ మేనేజర్ ఎం. లక్ష్మణ రావు, రీజినల్ మేనేజర్ ( రాజమహేంద్రవరం) జి.ఎల్.కె.ప్రసాద్, రీజినల్ మేనేజర్ (మైసూరు మరియు పెరియపట్నం) హెచ్.కె. గోపాల్, బోర్డు సభ్యులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.