- ప్రతిక్షణం.. ప్రతి అడుగు ప్రజల కోసం.. ప్రగతి కోసం అంటున్న ఎంపీ మహేష్ కుమార్..
- ఏడాదిలోనే ప్రగతికి బాటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
- గత ప్రజా ప్రతినిధులను మరిపించేలా పాలన సాగిస్తున్నారంటూ కొనియాడుతున్న ప్రజలు..
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి బలహీన వర్గానికి చెందిన యువకుడైన పుట్టా మహేష్ కుమార్ ను చట్టసభకు పంపించి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం చరిత్రను తిరగరాసే అవకాశం కల్పించారు. పుట్టా మహేష్ కుమార్ ను తమ వాడిగా అక్కున చేర్చుకున్న ప్రజలు ఆశీర్వదించి భారీ 1,81,857 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిపించారు. పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎవరికి ఇవ్వని అవకాశం ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చి ఆదరణ చూపించారు. ఇక్కడి ప్రజలు కేవలం ఓటు మాత్రమే కాదు వారి విశ్వాసం, మద్దతు, ప్రేమ, ఆశీర్వాదం కురిపించారు. తనపై ఉంచిన నమ్మకానికి విలువనిచ్చేలా నిరంతరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యాన్ని కర్తవ్యంగా భావించి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శ్రమిస్తున్నారు. రానున్న నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్ష మేరకు మరెన్నో అభివృద్ధి మైలురాళ్లు అధిగమించడం కోసం ముందుకు సాగుతున్నారు. ప్రతి క్షణం, ప్రతి అడుగూ, ప్రజల కోసం, ప్రగతి కోసం పరితపించే వ్యక్తి తమ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కావడం పట్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు..
పొగాకు రైతులకు వెన్ను దన్ను..
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సునిల్ బర్త్వల్ ను కలిసి పొగాకు రైతుల సమస్యలు వివరించారు. నిబంధనలు సడలించి పంట ఉత్పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వల్ల వర్జీనియా పొగాకు రైతులకు రూ.110 కోట్ల లబ్ది చేకూరింది.

కొల్లేరు ప్రాంత వాసులకు ఊరట..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా కొల్లేరు సమస్య పరిష్కారం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కోసం కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ న్యాయ నిపుణులతో దిల్లీ వేదికగా చర్చించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్య పరిష్కరించాలని విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కలిసి కొల్లేరు సమస్య వివరించారు. కొల్లేరు ప్రజల పక్షాన లోక్ సభలో గళం వినిపించి సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం సారధ్యంలో జిల్లా ప్రతినిధుల సహకారంతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన కృషి ఫలితంగా కొల్లేరు ప్రజలకు ఊరట కలిగింది. చివరకు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ మూడు రోజుల పర్యటనకు రావడంలో ఎంపీ ముఖ్యభూమిక పోషించారు.
“మహేష్ అన్న కానుక”.. నిరంతర ప్రక్రియగా..
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, నూతన వస్త్ర బహూకరణ వంటి శుభకార్యాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన సొంత నిధులతో “మహేష్ అన్న కానుక” అందజేస్తున్నారు. తాను లేని సమయంలో కార్యాలయం నుంచి ప్రతినిధులను పంపించి, కానుక అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు.
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు..
ఏలూరు పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారుల్లో నెలకొన్న సమస్యల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల పరిధిలో సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, కల్వర్టు పనులు తక్షణమే చేపట్టి ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు చేయాలని రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఉమాశంకర్ కు విన్నవించారు. అనంతరం కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గట్కారీని కలిసి జాతీయ రహదారుల సమస్యలు వివరించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో గుండుగొలను సమీపంలో గరుడా హోటల్ వద్ద వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది..

ల్యాబ్ పరికరాలు సమకూర్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల సందర్శన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్ ల్యాబ్ పరికరాల కొరత ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి వచ్చింది. తక్షణం స్పందించిన ఆయన ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లతో మొదటి విడతగా ఎంపిక చేసిన 50 ఉన్నత పాఠశాలలకు.. ఒక్కో పాఠశాలకు రూ.4 లక్షల విలువైన ల్యాబ్ పరికరాలను పంపిణీ చేశారు. ఒక్కో పాఠశాలకు ఇచ్చిన కిట్లల్లో 250 భౌతిక, రసాయన, గణిత, సామాజిక శాస్త్రాల ల్యాబ్ పరికరాలు సమకూర్చారు. తద్వారా విద్యార్థులు ప్రయోగాలు వివిధ విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఆసక్తి పెంచుకుని, భవిష్యత్తును విజ్ఞానపరంగా బాటలు వేసుకునేందుకు వీలు కల్పించారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో సమస్యల పరిష్కారం..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చింతలపూడి మండలం ప్రగడవరంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తక్షణం స్పందించి ప్రగడవరంలో తాగునీటి పైపులైన్, యుద్ధ ప్రాతిపదికన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీ నిధులతో పోలీస్ విశ్రాంతి బ్యారక్ నిర్మాణం..
ఏలూరు పట్టణం 32వ డివిజన్ పరిధిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 64.08 లక్షలు ఎంపీ నిధులతో చేపడుతున్న పోలీస్ విశ్రాంతి మహిళ, పురుషుల బ్యారక్ నూతన భవన నిర్మాణానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ చొరవతో రహదారికి మోక్షం..
తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు వేలేరుపాడు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవునా ప్రధాన రహదారి రాళ్లు లేచి మోకాళ్ళ లోతు గుంతలతో ప్రజలు ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకం అనుభవించారు. వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడ్డారు. కుక్కునూరు మండలానికి చెందిన నాయకులు, ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు తక్షణం స్పందించారు. రహదారిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.34.50 కోట్లు విడుదల చేయించి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. ఫలితంగా అద్వానంగా ఉన్న రహదారికి మోక్షం లభించింది.
ఎంపీ నిధులతో భోజన శాల నిర్మాణం..
దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడు ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదాన సత్రం, అన్న కాంటీన్ నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దేవాలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనాలు రూపొందించమని ఆదేశించారు. అధికారులు సమర్పించిన అంచనాల నివేదిక ప్రకారం అన్నదాన సత్రం నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు హామీ ఇవ్వడం జరిగింది.
గ్రంథాలయ భవనం నిర్మాణానికి హామీ..
ఏలూరు కొత్త బస్టాండ్ సెంటర్ సమీపంలోని జిల్లా గ్రంథాలయం భవనం శిధిలావస్థకు చేరుకుందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణం స్పందించి స్వయంగా సందర్శించారు. పాఠకులు, ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రంథాలయ అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
నాయి బ్రాహ్మణ సామాజిక భవనం నిర్మాణానికి స్థల సేకరణ..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో నాయిబ్రాహ్మణ సేవ సంఘం సామాజిక భవన నిర్మాణ నిమిత్తం ఎంపీ నిధుల మంజూరుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. నిర్మాణానికి అవసరమైన స్థల సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ తక్షణం స్పందించి త్వరగా స్థల సేకరణ పూర్తి చేయాలని తహశీల్ధార్ ను ఆదేశించారు. స్థల సేకరణ అనంతరం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
బాధితులకు ఆపన్న హస్తం..
ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 149 మందికి రూ.1.67 కోట్ల పైచిలుకు ఆర్థిక సహాయం అందించారు. అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక తోడ్పాటు అందించారు.
పోలవరం ప్రాజెక్టుపై ఎంపీ ఫోకస్:
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిర్వాహకం వల్ల మందగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతపై ఎంపీ మహేష్ కుమార్ లోక్ సభలో తన గళం వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్లు మంజూరు కావడంలో ఎంపీ మహేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
వందే భారత్ రైలు ఏలూరులో ఆగింది :
విశాఖపట్నం, సికింద్రాబాద్ నడుమ ఏలూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ రైలుకు ఏలూరు రైల్వే స్టేషన్ లో హాల్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఏలూరు నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ వందే భారత్ రైలులో ప్రయాణించాలనే ఏలూరు జిల్లా ప్రజల కలను ఎంపీ మహేష్ కుమార్ సహకారం చేశారు. ఎంపీ కృషితో ఏలూరు రైల్వేస్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు హాల్టు అనుమతి లభించింది.
యువతకు ఎంపీ మహేష్ కుమార్ బాసట:
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యువతకు బాసటగా నిలిచారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏలూరులో భారీ జాబ్ మేళా నిర్వహించారు. విద్యార్హత, నైపుణ్యాలు కలిగిన యువతకు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడేందుకు ఎంపీ చేయూతనందించారు. అలాగే జూలై 14న మెగా జాబ్ మేళా నిర్వహించి మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
వరద బాధితులకు ఎంపీ సాయం:
సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఎంపీ మహేష్ కుమార్ తన వంతు ఆర్థిక తోడ్పాటు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల చెక్కు అందజేశారు.
రూ. 1000 కోట్లతో 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి పరిపాలన ఆమోదం..రైల్వే ట్రాక్ ల వద్ద గంటల తరబడి తలెత్తే ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 16 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎంపీ విన్నపానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం రూ. 1000 కోట్లతో చేపట్టే 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఇటీవల పరిపాల ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటిని నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.