ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
గత ఐదేళ్ల వైయస్సార్సీపి ప్రభుత్వం సాగించిన అరాచక పాలనలో జరిగిన విధ్వంసం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచర ఎంపీలతో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా “పీ-4” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, దాతల నుంచి కూడా చక్కటి స్పందన వస్తుందని ఎంపీ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ, క్వాంటం కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తాయని, ఇప్పటి నుంచే యువత ఆ దిశగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీ వెల్లడించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెస్ఎంలను ఏర్పాటు చేస్తుందని, చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటికే ఎంఎస్ఎంఈ ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం కూడా జరిగిందని, అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వివరించారని ఎంపీ తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ కావడానికి త్వరలో “వాట్సాప్ గవర్నెన్స్” ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంసిద్ధత వ్యక్తం చేశారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.