🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్:
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయం సిబ్బంది మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభం అయిన ఎన్టీఆర్ ప్రయాణం ఒక మహాశక్తిగా మారిందని తెలిపారు. సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి విరాళాలు సేకరించి ఎన్టీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకే దక్కుతుందని స్పష్టం చేశారు.
సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ముమ్మడి చింతయ్య, ఆలూరి రమేష్, తెనాలి సురేష్, వీర్ల ప్రతాప్, ఎంపీ మహేష్ కుమార్ ఓ.ఎస్.డి రాఘవులు, కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.