- జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన తెదేపా ఎస్సీ విభాగం నాయకులు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని, కులరహిత సమాజం కోసం ఎనలేని కృషిచేసిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా ఎస్సీ విభాగం నాయకులు, కార్యాలయం సిబ్బంది బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. తన పాలన దక్షతతో దేశానికి ఎనలేని సేవలు అందించిన బాబూ జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు.
బాబూ జగ్జీవన్ రామ్ తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని, ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, ఎస్సీ సంఘాల నాయకులు మెండం సంతోష్, ఎన్ఏడి పాల్, కె.ప్రేమ్, ఎన్. కార్తీక్, పి.రమణ. తదితరులు పాల్గొన్నారు.