The Desk…Eluru : ఏపీలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

The Desk…Eluru : ఏపీలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

  • రాజధాని అమరావతికి రైల్వే లైన్ల అనుసంధానం
  • .భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తికి చర్యలు.

దిల్లీ/ ఏలూరు : ది డెస్క్:

ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజధాని అమరావతికి రైల్వే లైన్లు అనుసంధానం చేస్తున్నామని, భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర రైల్వేలు, సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం లోక్ సభలో లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.

రూ.2155 కోట్లతో చేపట్టిన భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రైల్వే సమస్యలను బుధవారం లోక్ సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రస్తావించారు.

భద్రాచలం- కొవ్వూరు రైల్వే ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో కీలకంగా మారిన ఈ ప్రాజెక్టు వల్ల అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని ఎంపీ మహేష్ కుమార్ లోక్ సభలో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య 150 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని, 200 గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్ర రైల్వేలు, సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన భద్రాచలం – కొవ్వూరు రైల్వే ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పనులు 2022 మే నాటికి పూర్తయ్యాయని, సత్తుపల్లి – కొవ్వూరు రైల్వే లైన్ పనులు పురోగతిలో ఉన్నాయని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా రూ.9,450 కోట్లతో 4300 ఓవర్ బ్రిడ్జిలు, ఆర్ఓబి , ఆర్.యు.బి చేపట్టగా, ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన 284 ఓవర్ బ్రిడ్జిలు, ఆర్ఓబి, ఆర్.యు.బిల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఆరు చోట్ల ప్రతిపాదించిన ఆర్ఓబి, ఆర్.యు.బి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి కేంద్ర రైల్వేలు, సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, నిధుల మంజూరులో తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

యూపీఏ ప్రభుత్వం పదేళ్లలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్లు ఖర్చు చేయగా, ఎన్డీఏ ప్రభుత్వం రూ.9417 కోట్లు ఖర్చు చేసిందని, యూపీఏ ప్రభుత్వం ఏడాదికి 72 కిలోమీటర్ల చొప్పున కేవలం 750 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు వేయగా, ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఏటా 151 కిలోమీటర్ల చొప్పున ఇప్పటి వరకు 1510 కిలోమీటర్లు పూర్తి చేసినట్టు కేంద్ర మంత్రి బదులిచ్చారు.

విశాఖపట్నంకి సౌత్ కొస్టల్ రైల్వే మంజూరు చేయగా, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని, అలాగే రాజధాని అమరావతికి రైల్వే లైన్లు అనుసంధానిస్తున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.