🔴 దిల్లీ/ ఏలూరు : THE DESK :
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ విదేశీ పోర్టులకు గత ఐదేళ్లలో కేటాయించిన నిధుల వినియోగం, సరుకు రవాణాపై లోక్‌సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ శుక్రవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ (షాహిద్ బెహెస్తీ పోర్ట్), మయన్మార్‌లోని సిట్వే పోర్ట్ భారతదేశానికి చెందిన ఈ రెండు విదేశీ పోర్టులు పనిచేస్తున్నాయని, ప్రస్తుతం పూర్తి కావాల్సిన పోర్టు ప్రాజెక్టులు లేవని, గత పదేళ్లలో చాబహార్ పోర్టుకు రూ.500 కోట్లు కేటాయించగా, రూ.168.90 కోట్లు వినియోగించినట్లు, మయన్మార్ పోర్టుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.4.22 కోట్లు కేటాయించగా, రూ.3.97 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి బదులిచ్చారు.
గత ఐదేళ్లలో చాబహార్ పోర్టు నుంచి 1,07,45,574 మెట్రిక్ టన్నులు, మయన్మార్ పోర్టు నుంచి ఈ ఏడాది 46,317.96 మెట్రిక్ టన్నుల సరుకు తరలించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.