The Desk…Eluru : జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు చేయండి : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ పుట్టా వినతి

The Desk…Eluru : జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు చేయండి : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ పుట్టా వినతి

దిల్లీ/ ఏలూరు, ది డెస్క్ :

ఏలూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు సబ్ వేస్ లు, ఫ్లై ఓవర్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ హౌస్ మంత్రి చాంబర్ రోడ్ లోని కార్యాలయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ మహేష్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు.

కొల్లేటికోటకు డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ. 109 కోట్లు ఇవ్వండి :

గుండుగొలను నుండి పెద్దింట్లమ్మవారి దేవాలయం వరకు దాదాపు 24 కిలోమీటర్ల రహదారి కొల్లేరు సరస్సు ప్రాంతం నుంచి వెళ్తుందని, కొల్లేటిలంక గ్రామాలకు ప్రసిద్ధ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయానికి ఏడాది పొడవునా యాత్రికులు సందర్శిస్తారని, పర్యాటక ప్రదేశమైన కొల్లేరుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చే పక్షులను సందర్శించడానికి కొల్లేరు సరస్సు ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శిస్తారని.. ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్పటికే ఉన్న సింగిల్ లేన్ సర్ఫేస్ రోడ్డు అగడలంక ఛానల్‌కు సమాంతరంగా ఉందని, ఈ రహదారిలో ప్రజలు, పర్యాటకులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.109 కోట్లు మంజూరు చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

ఏడు బ్లైండ్ స్పాట్లు వద్ద ఫ్లై ఓవర్లు, సబ్ వేస్ నిర్మించండి:

అలాగే భీమడోలు వద్ద రెండు కి.మీ ఫ్లైఓవర్ నిర్మించాలని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న కూరెళ్లగూడెం వద్ద ప్రజలు ఇంటర్‌చేంజ్ క్రాస్ పాయింట్‌ను దాటి అవతలి వైపునకు రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. అంబర్‌పేట, వడ్లపట్ల జెడ్పీ రోడ్డు నుంచి అంబర్‌పేట పొలిమేరపుంత వరకు 1200 మీటర్ల మేర ఫ్లై ఓవర్‌ నిర్మించాలని, పి.కన్నాపురం నుండి పుల్లకి ఇంటర్‌చేంజ్ పాయింట్ వద్ద 600 మీటర్లు రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఎంపీ మహేష్ కుమార్ కేంద్రమంత్రికి వివరించారు.

ప్రమాదాలను నివారించడానికి పి.కన్నాపురం జెడ్పీ రోడ్డు నుంచి కోడూరుపాడు జెడ్పీ రోడ్డు వరకు 1200 మీటర్ల మేర ఫ్లై ఓవర్ లేదా సబ్ వే నిర్మించాలని, జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కైకరం ఇంటర్‌ చేంజ్ క్రాసింగ్ పాయింట్ వద్ద రెండు నియోజకవర్గాలను కలిపే జాతీయ రహదారికి ఆర్ అండ్ బీ రోడ్డు కనెక్టింగ్ ఉందని, గ్రామానికి అవతలి వైపునకు రాకపోకలు సాగించే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ రోడ్డు నుండి కైకరం ముగింపు పాయింట్ వరకు కిలోమీటర్ పొడవు ఫ్లై ఓవర్ లేదా సబ్-వే నిర్మించాలని, మేజర్ పంచాయతీలైన చేబ్రోలు, నారాయణపురం వద్ద నర్సాపురం వైపు ఆర్ అండ్ బీ రోడ్డు దాటుతున్నప్పుడు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఈ రహదారిని దాటే సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు తాళ్లాపురం పుంత రోడ్డు నుంచి చేబ్రోలు మీదుగా నారాయణపురం గ్రామ శివారు వరకు కిలోమీటర్ పొడవునా ఫ్లై ఓవర్ లేదా సబ్ వే నిర్మించాల్సిన అవసరాన్ని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ హెచ్ -216ఏ, ఎన్.హెచ్-16 జాతీయ రహదారిలో గుర్తించిన ఏడు బ్లైండ్ స్పాట్లు వద్ద ఫ్లైఓవర్‌లు, సబ్ వేస్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఉంగుటూరు వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి:

రైళ్ల రాకపోకల వల్ల జరిగే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటూ ఉంగుటూరు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రుని కోరారు.

సీతంపేట వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి:

దెందులూరు మండలం సీతంపేట జంక్షన్ వద్ద నాలుగు మీటర్ల ఎత్తు బాక్స్ కల్వర్టు, లేదా పీయుపీ/ సీయుపీ నిర్మాణంతో పాటు గుండుగొలను జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి, బాక్స్ కల్వర్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ కోరారు. ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.