The Desk…Eluru : అన్నీ తానై… ఎమ్మెల్సీ ఎన్నికల  కౌంటింగ్ లో కలెక్టర్ వెట్రిసెల్వి

The Desk…Eluru : అన్నీ తానై… ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో కలెక్టర్ వెట్రిసెల్వి

  • నిరంతరాయంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కలెక్టర్..
  • పోటీలో 35 మంది అభ్యర్థులు… జంబో బ్యాలెట్ పేపర్..
  • జిల్లా కలెక్టర్ స్వీయ పర్యవేక్షణలో అనుకున్న సమయంకంటే ముందుగానే ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ..

ఏలూరు జిల్లా : ఏలూరు: ది డెస్క్ :

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నీ తానై సమర్థవంతంగా నడిపించారు.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఏలూరులోని సర్. సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, మంగళవారం మధ్యాహ్నం వరకు జరిగింది. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో బ్యాలెట్ పత్రాలతో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు అత్యంత క్లిష్టమైనది.

పోటీలో 35 మంది అభ్యర్థులు, అంతమంది పేర్లతో కూడిన ‘జంబో ‘ బ్యాలెట్ పేపర్. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం నుండి జిల్లా కలెక్టర్ కౌంటింగ్ సిబ్బందితో ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా ఓట్ల లెక్కింపును సునిశితంగా పర్యవేక్షించారు.

సోమవారం ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ సిబ్బందిని సమాయత్త పరచడం… స్ట్రాంగ్ రూంల నుండి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాలులోకి సిబ్బంది తీసుకువచ్చిన తరువాత ఏ టేబుల్ కు కేటాయించిన పోలింగ్ స్టేషన్ కు సంబందించిన బ్యాలెట్ బాక్స్ అదే టేబుల్ కి వెళ్ళింది, లేనిదీ అని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

బ్యాలెట్ బాక్సులలో బ్యాలెట్ పత్రాలను లెక్కింపు, డ్రం లో వేయడం… వారిలో చెల్లినవి, చెల్లని ఓట్లను వేరుచేసే కార్యక్రమం, చెల్లిన, చెల్లని ఓట్లను ఏజెంట్లు చూపి, వాటిని లెక్కింపు బాక్సులలో వేసి, ప్రాధాన్యతా ఓట్లను లెక్కించేవరకు అన్ని అంశాలలో ప్రతీ పనిని జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి, అన్నీ తానై నడిపించారు.

ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఎక్కువ సమయం పడుతుందని ఊహించినప్పటికీ, జిల్లా కలెక్టర్ చొరవ, అలుపెరుగని పర్యవేక్షణతో ఊహించిన సమయం కంటే ముందుగానే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముగిసింది.

వీరికి తోడుగా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డి ఆర్ ఓ వి.విశ్వేశ్వర రావు ఎన్నికల నిర్వహణలో సజావుగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా కర్తవ్య బాధ్యత నిర్వహించారు. అంతేకాకుండా ఎన్నికల మీడియా సెంటర్ లో పాత్రికేయులకు సరైన సదుపాయాలు ఉన్నాయి లేదా అని మీడియా సెల్ సందర్శించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు.